భద్రతతోనే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి.
– రామగుండం–2లో త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశం.
– ‘జీరో హార్మ్’ లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపు.
– గనుల్లో శాస్త్రీయ భద్రతా అధ్యయనాలపై దృష్టి.
జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 24:
రామగుండం ఏరియా–2లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆధ్వర్యంలో 21వ త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. గనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులు సూచించారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ మాట్లాడుతూ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. యంత్రాల పని గంటలను సమర్థవంతంగా పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి గనిలో శాస్త్రీయ భద్రతా అధ్యయనాలు నిర్వహించి ఉద్యోగుల్లో భద్రతా అవగాహన పెంపొందించాలని అన్నారు.
2026–27 సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ‘జీరో హార్మ్’ లక్ష్యంతో సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఉత్పత్తి, భద్రత రెండింటినీ సమన్వయం చేయాలని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్) సాగేష్ కుమార్ ఎం.ఆర్. నేతృత్వంలోని డీజీఎంఎస్ బృందం గత సమావేశంలో చేసిన సూచనల అమలు తీరును సమీక్షించింది. ప్రమాదాల నివారణ చర్యలు, యంత్రాల భద్రత, విద్యుత్ భద్రత, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రామగుండం–2 జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య మాట్లాడుతూ ప్రమాద రహిత ఉత్పత్తి కోసం నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల్లో భద్రతా సంస్కృతి పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ముందస్తు భద్రతా చర్యల వల్ల ప్రమాదాల అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్లు అనిల్ టొప్పో, కౌశిక్ సేన్‌గుప్తా, దీపక్ కుమార్ ప్రభాకర్, కోమల్ చౌదరి, కార్పొరేట్ జీఎం (సేఫ్టీ) కె. సాయిబాబు, ఆర్జీ రీజియన్ జీఎం (సేఫ్టీ) ఎం. మల్లయ్య, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి జి. సాంబశివరావు, సీఎంవోఏఐ ప్రధాన కార్యదర్శి పి. నరసింహులు తదితర అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments