EPAPER
Friday, June 26, 2026
Google search engine

సీతకుంట ‘సర్కారు’ భూమిపై కబ్జా కోరలు..!?

📰 Generate e-Paper Clip

సీతకుంట ‘సర్కారు’ భూమిపై కబ్జా కోరలు..!?

•  అధికార పార్టీ అండతోనే మట్టిపోతలు..?
•  ఖద్దరు అండ.. అధికారుల ఆశీస్సులతో దర్జాగా దందా..!
•  ‘రెవెన్యూ’  మౌనం వెనుక రహస్యమేమిటి..?
•  నివేదిక సిద్ధం.. కానీ ‘తొక్కుడు’ ఎందుకు..?
•  జాయింట్ సర్వే నివేదికను బహిర్గతం చేయాలంటున్న ప్రజలు, ప్రజాసంఘాలు..

జనం వాయిస్, శాయంపేట, జూన్ 25 :

ప్రభుత్వ ఆస్తులకు రక్షకులుగా ఉండాల్సిన వారే భక్షకులకు పరోక్షంగా సహకరిస్తున్నారా..? సామాన్యుడి సెంటు భూమి సమస్య వస్తే చట్టాలు మాట్లాడే అధికారులు, లక్షల విలువైన సర్కారు భూమి కళ్లముందే కబ్జా అవుతుంటే ఎందుకు ‘ధృతరాష్ట్ర’ ప్రేమ వలకబోస్తున్నారు..? శాయంపేట మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆనుకొని  ఉన్న “సీతకుంట” భూమి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎస్సారెస్పీకి చెందిన సర్వే నంబర్లు 542, 543 లలోని విలువైన ప్రభుత్వ భూమిని మైలారం గ్రామానికి చెందిన చల్ల సంజీవరెడ్డి అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా, తన కుమారుడి పేరిట బదలాయించుకుని ‘సర్కారు’ భూమికే ఎసరు పెట్టారనే ఆరోపణలు, ఫిర్యాదులున్న నేపథ్యంలో ఆ వివాదస్పద భూమిలో మట్టిపోతలు చేపట్టడం స్థానికంగా చర్చకు తెరలేపింది.

•  నివేదిక సిద్ధం.. కానీ ‘తొక్కుడు’ ఎందుకు..?

ఈ భారీ భూ అక్రమంపై గతంలో శాయంపేట గ్రామ ఉపసర్పంచ్ సుమన్ స్పందిస్తూ, ఆధారాలతో సహా తహసీల్దార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెవెన్యూ, ఎస్సారెస్పీ అధికారులు క్షేత్రస్థాయిలో ‘జాయింట్ సర్వే’ నిర్వహించారు. ఆ సర్వేలో సదరు భూమి నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని, కబ్జా నిజమేనని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, సర్వే పూర్తయి రోజులు గడుస్తున్నా ఆ నివేదికను ఇప్పటివరకు ఎందుకు ‘గోప్యంగా’ ఉంచారు..? ఎవరిని కాపాడటానికి ఈ నివేదికను తొక్కిపెడుతున్నారు..? తెరవెనుక నడిచిన ‘చేతుల మార్పిడి’ కథేంటి..? అని శాయంపేట ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి.

•  ఖద్దరు అండ.. అధికారుల ఆశీస్సులు…

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి స్థానిక రెవెన్యూ శాఖలోని కొందరు పెద్దలతో ‘ఆర్థిక’ అనుబంధం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అపవిత్ర బంధం వల్లే.. వివాదాస్పద భూమిలో రాత్రికి రాత్రే మట్టిపోతలు పోస్తూ, కుంట స్వరూపాన్నే మార్చేస్తున్నా… అధికారులు కళ్లుండి చూడలేని కబోదుల్లా మౌనవ్రతం చేస్తంన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతల ‘రాజకీయ రక్షణ కవచం’ కబ్జాదారుడికి పుష్కలంగా ఉండటంతోనే, యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు సామాన్య, రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి గుంట భూమి కొంటే వంద రూల్స్ మాట్లాడే అధికారులు.. ఇంత బహిరంగంగా ప్రభుత్వ భూమిని మింగేస్తుంటే ఎందుకు మోకరిల్లారు..? కబ్జాదారుడికి, అధికారులకు ఉన్న లింకేంటో తేలాలి” అని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

•  కలెక్టర్ గారూ.. కబ్జా కోరల నుంచి ‘సీతకుంట’ను కాపాడండి..!

రెవెన్యూ, ఎస్సారెస్పీ స్థానిక అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపిన వేళ.. ఇక జిల్లా ఉన్నతాధికారులే ఈ భూదందాపై సర్జరీ చేయాలని స్థానికులు భావిస్తున్నారు.
తొక్కిపెట్టిన జాయింట్ సర్వే నివేదికను తక్షణమే బహిర్గతం చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని,  ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కబ్జాదారులపై, దానికి సహకరించిన సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మట్టిపోతలను తక్షణమే నిలిపివేసి, సీతకుంట భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ‘సర్కారు భూమి’ అని బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు ప్రజాసంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరపకపోతే…. ప్రభుత్వ యంత్రాంగం మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లడమే కాకుండా ప్రభుత్వ భూమిని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ప్రత్యక్ష ఆందోళన చేపట్టే అవకాశం ఉందనేది గమనార్హం.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!