పుట్టింటి నుంచే బయటకు పంపారు’
సభలో బోరున విలపించిన కవిత
– బీఆర్ఎస్ సస్పెన్షన్‌పై భావోద్వేగానికి గురైన కవిత
– సభలో కన్నీటి పర్యంతమైన కవిత
– ‘‘కవిత సీఎం’’ అంటూ కార్యకర్తల నినాదాలు
– కొత్త పార్టీ పెట్టడానికి కారణాలు వివరించిన కవిత
– తీహార్ జైలుకు పంపిన వారికి ఎన్నికల్లో సమాధానమిస్తామని ప్రతిజ్ఞ
జనం వాయిస్, హైద్రాబాద్ బ్యూరో, ఆగష్టు 31:
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం తనను జైలుకు పంపారని పెద్ద నాయకులే చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత అదే పార్టీ నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాతో ఎందుకు ఇలా చేయాలి?’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
నిజామాబాద్‌లో నిర్వహించిన తన పార్టీ పాంచజన్య సభలో కవిత మాట్లాడారు. సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి నిజామాబాద్ గడ్డపై అడుగుపెట్టిన ఆమె.. బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన తాను పిరికిదాన్ని కాదన్నారు. అవి బాధ, ఆవేశంతో వచ్చిన కన్నీళ్లని చెప్పారు.
కవిత బోరున విలపించడంతో సభలో ఉన్న మహిళలు సైతం కంటతడి పెట్టుకున్నారు. కార్యకర్తలు ‘‘కవిత సీఎం.. సీఎం’’ అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.
తెలంగాణలో ఇంకా ఎన్నో మంచి పనులు చేయాల్సి ఉందని కవిత చెప్పారు. అందుకే కొత్త పార్టీ పెట్టానన్నారు. తనను పుట్టింటి నుంచి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆర్నెల్లు జైలులో ఉండి వచ్చినప్పుడు పుట్టినిల్లు ఆదరించలేదన్నారు. అదే సమయంలో తన అత్తమామలు ఒక్క మాట కూడా అనకుండా కడుపులో పెట్టుకుని కన్నబిడ్డలా చూసుకున్నారని చెప్పారు.
ఏ తప్పూ చేయని తనను తీహార్ జైలుకు పంపిన వారికి ఎన్నికల్లో గెలుపుతో సమాధానం చెబుతానన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కొత్త రాజకీయ శక్తి అవసరమని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీళ్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన వారిని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఎందుకు వెనక్కి తగ్గుతోందని ప్రశ్నించారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments