గాల్లో ఉండగా పిడుగు.. దెబ్బతిన్న ఇండిగో విమానం ముక్కు.
- పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంపై పిడుగుపాటు.
- 17,000 అడుగుల ఎత్తులో ఘటన.
- విమానంలోని 110 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం.
- ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశం.
జనం వాయిస్, పాట్నా, అక్టోబర్ 8:
పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఉండగా పిడుగు తాకింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగోకు చెందిన 6E 625 విమానం బుధవారం పాట్నా నుంచి లక్నో బయల్దేరింది. విమానం 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటు ధాటికి విమానం ముందు భాగంలో ఉండే రాడోమ్ (నోస్ కోన్) దెబ్బతింది. అయినప్పటికీ, పైలట్ విమానాన్ని లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. షెడ్యూల్ సమయం కంటే 8 నిమిషాల ముందే ల్యాండ్ కావడం గమనార్హం. ఈ ఘటనపై ఇండిగో సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రతికూల వాతావరణం, వడగళ్ల వాన కారణంగానే విమానం రాడోమ్ దెబ్బతిన్నట్లు తెలిపింది. ప్రయాణికులందరూ తమ గమ్యస్థానంలో సురక్షితంగా దిగారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించినట్లు పేర్కొంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం దెబ్బతిన్న విమానాన్ని గ్రౌండ్ చేశారు. అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, రెగ్యులేటరీ అధికారుల నుంచి క్లియరెన్స్ పొందిన తర్వాతే విమానం తిరిగి సేవలు ప్రారంభిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments