తెలంగాణకు ‘మురసు’ తుపాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు!
- మంగళవారం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.
- ఏపీ తీరంలో నెల్లూరు–నర్సాపురం మధ్య తుపాను తీరం దాటే అవకాశం.
- గంటకు 120 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 2:
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుపాను తెలంగాణకు ముప్పుగా మారింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మంగళవారం మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడనుంది. నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజాము మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సోమవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments