ర్యాగింగ్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా.
- వైద్య వృత్తి ప్రాణదాతలుగా నిలిచే పవిత్ర బాధ్యత.
- విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన సీపీ అంబర్ కిశోర్ ఝా.
- సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా నిలవాలి.
జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 11:
విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటూ, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిలవాలని, క్రమశిక్షణ, పరస్పర గౌరవం, సేవాభావంతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదని, ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలిచే మహోన్నత బాధ్యత అని పేర్కొన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)లో యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై ఉన్న చట్టపరమైన నిబంధనలు, శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సులో సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి సాధారణ ఉద్యోగం లేదా సేవ కాదని, ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే అత్యంత బాధ్యతాయుతమైన వృత్తి అని అన్నారు. అందుకే సమాజంలో వైద్యులకు ప్రత్యేక గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యాభ్యాస సమయంలోనే క్రమశిక్షణ, మానవతా విలువలు, సేవాభావం, పరస్పర గౌరవాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మంచి వైద్యులుగా ఎదగడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
సీనియర్లు మార్గదర్శకులుగా ఉండాలి
గోదావరిఖని ఏసీపీ ఎం. రమేశ్ మాట్లాడుతూ.. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు సహాయ సహకారాలు అందిస్తూ సరైన మార్గదర్శకత్వం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వేధింపులకు గురిచేయరాదన్నారు. కళాశాలలో ప్రతి విద్యార్థి భయం లేకుండా, సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసించేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా పరస్పరం గౌరవించుకుంటూ స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు.
ర్యాగింగ్‌కు పూర్తిగా స్వస్తి పలకాలి.
విద్యార్థి దశలో ఏర్పడే స్నేహాలు, అనుబంధాలు జీవితాంతం గుర్తుండిపోతాయని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. అయితే ర్యాగింగ్ పేరుతో జూనియర్లను అవమానించడం, భయపెట్టడం, మానసికంగా వేధించడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. తాను బీహార్ నుంచి తమిళనాడులోని ఎన్ఐటీ తిరుచ్చిలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన రోజులను గుర్తుచేసుకున్నారు. అక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో ర్యాగింగ్‌కు తావులేని సురక్షిత విద్యా వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కళాశాలలో ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులందరిపై ఉందని పేర్కొన్నారు.
డ్రగ్స్‌తో భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది
ర్యాగింగ్‌తో పాటు డ్రగ్స్ వ్యసనం యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని సీపీ హెచ్చరించారు. ఒక్కసారి మాదకద్రవ్యాలకు బానిసైతే వాటి నుంచి బయటపడటం కష్టమని, వాటి ప్రభావం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబంపై కూడా పడుతుందని అన్నారు. డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితులను పరిశీలిస్తే మాదకద్రవ్యాల దుష్పరిణామాల తీవ్రత అర్థమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండటంతో పాటు తమ స్నేహితులు, తోటి విద్యార్థులు కూడా వాటికి అలవాటు పడకుండా చైతన్యపరచాలని సూచించారు. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు, శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల విద్యాభ్యాసం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, భవిష్యత్ కెరీర్ దెబ్బతింటాయని తెలిపారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా హాస్టళ్లు, కళాశాల ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ఇతర సాధారణ ప్రదేశాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాకు అవకాశం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. కొద్దిమంది విద్యార్థుల తప్పిదాల కారణంగా మొత్తం కళాశాల పేరు ప్రతిష్ఠ దెబ్బతినకూడదని సీపీ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్న ఈ సంస్థకు తగిన విధంగా విద్యార్థులు క్రమశిక్షణ, ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలకు గర్వకారణంగా నిలిచేలా కష్టపడి చదివి, భవిష్యత్తులో పేదలు, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికీ వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు, ప్రిన్సిపాల్ దయాల్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖ, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేశ్, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ ఎస్ఐ రమేశ్, ఆర్ఎస్ఐ ప్రవీణ్, వన్‌టౌన్ ఎస్ఐలు మనోహర్, రాజశేఖర్, ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు, వార్డెన్ డాక్టర్ ఓబులేష్, మెడికోలు, పోలీసు అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments