ఇంద్రకీలాద్రిపై దసరా శోభ.. బాలాత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ.
- ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రులు.
- తొలిరోజు బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ.
- అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు.
- పది రోజుల పాటు పది అలంకారాల్లో భక్తులకు కనువిందు చేయనున్న దుర్గమ్మ.
జనం వాయిస్, ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 11:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పది రోజుల పాటు కనకదుర్గమ్మ పది రకాల విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన నేడు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.
అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అలంకార ప్రాముఖ్యత విషయానికి వస్తే.. పండితుల ప్రకారం, బాలాత్రిపుర సుందరి దేవి అత్యంత శక్తివంతమైన దేవత. శ్రీచక్రంలోని ప్రథమ ఆవరణలో ఈమె కొలువై ఉంటుంది. బాల మంత్రాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. విద్యా ఉపాసకులకు ప్రప్రథమంగా ఈ మంత్రాన్నే ఉపదేశిస్తారు. బాలాత్రిపుర సుందరి అనుగ్రహం లభిస్తే మహాత్రిపుర సుందరి దేవి కటాక్షం సులభంగా సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకు అధిదేవత కాబట్టే ఆమెను ‘త్రిపుర’ అని పిలుస్తారు. ఈ మూడు స్థితుల్లో మనలోనే ఉంటూ విశ్వాన్ని పరిపాలిస్తుందని భక్తుల నమ్మకం. శరన్నవరాత్రుల్లో బాలాత్రిపుర సుందరి దేవి దర్శనం సంపూర్ణ ఫలదాయకమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments