EPAPER
Friday, June 12, 2026
Google search engine

సింగరేణి కార్మికులకు శుభవార్త.

📰 Generate e-Paper Clip

సింగరేణి కార్మికులకు శుభవార్త.

త్వరలో మెడికల్ బోర్డు ప్రారంభం.
335 మందికి ఉద్యోగ పత్రాలు.
సంక్షేమ చర్యలపై ప్రభుత్వం దృష్టి.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 12:

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ కారణాలతో కొంతకాలంగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత త్వరలో యథావిధిగా ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మెడికల్ బోర్డును పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించి అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజమైన అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.
ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం, మోసాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, మెడికల్ బోర్డు ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంచి కార్మికులు సహకరించాలని కోరారు. ఇటీవల కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు ఈ నెల 13న మంచిర్యాలలో జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్మిక కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో 2,657 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీటిలో 2,102 కారుణ్య నియామకాలు ఉండగా, 555 ప్రత్యక్ష నియామకాలు చేపట్టినట్లు వివరించారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచడం ద్వారా మరింత మంది అర్హులకు అవకాశం కల్పించామని తెలిపారు. ఇప్పటికే 200 మందికి పైగా లబ్ధి పొందినట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రూ.10 లక్షల ఉచిత సహజ బీమా సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రమాద బీమా సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో సింగరేణి కార్మికులకు రూ.1,500 కోట్ల లాభాల వాటా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సింగరేణిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఏరియా ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నామని, గోదావరిఖనిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సేవల కోసం ప్రతి సంవత్సరం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!