ఆధునిక వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
రూ.39 లక్షల విలువైన నూతన వైద్య పరికరాల ఏర్పాటు పూర్తి
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్
జనం వాయిస్, పెద్దపల్లి, మే 07:
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆసుపత్రికి కొత్తగా వచ్చిన సుమారు రూ.39 లక్షల విలువైన వైద్య పరికరాల ఏర్పాటు పూర్తయ్యిందని తెలిపారు. చిన్నపాటి సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సుమారు వెయ్యి మంది ఓపీ రోగులు ఆసుపత్రికి వస్తున్నందున వారికి అవసరమైన అన్ని సేవలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్మసీ విభాగాన్ని పరిశీలించి మందుల లభ్యతపై ఆరా తీశారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్లిట్ ల్యాంప్, 90డి లెన్స్, సి-ఆర్మ్ మిషన్, యూరాలజీ పరికరాలు, స్పిరోమీటర్, ఆడియోమీటర్, ఫైబర్ ఆప్టిక్ లారింగోస్కోప్, డెర్మా చెయిర్, అల్ట్రాసౌండ్ మిషన్, హీటింగ్ ప్యాడ్, చెస్ట్ వైబ్రేటర్, రూట్ కెనాల్ చికిత్సకు అవసరమైన ఎండోమోటర్, మైక్రోమోటర్ హ్యాండ్ పీస్ తదితర ఆధునిక పరికరాల వినియోగంపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్, వైద్యులు, తదితరులు, పాల్గొన్నారు.




Recent Comments