నయన్ లైఫ్‌స్టైల్ ఖర్చుపై విఘ్నేష్ వ్యాఖ్యలు.
జనం వాయిస్, హైదరాబాద్, మే 7:
దక్షిణాది సినీ పరిశ్రమలో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు పొందిన నయనతార విలాసవంతమైన జీవనశైలి గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నయనతార సౌకర్యవంతమైన జీవితం గడపాలంటే రోజుకు ఎంత ఖర్చవుతుందనే అంశంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నయనతార ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర నటిగా కొనసాగుతున్నారు. ‘జవాన్’ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించిన ఆమెకు దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గం ఉంది. సినిమాలతో పాటు నిర్మాణ సంస్థలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, ఇతర వ్యాపారాల ద్వారా కూడా భారీ ఆదాయం పొందుతున్నారు.
చెన్నై, ముంబై, హైదరాబాద్, కేరళ వంటి ప్రాంతాల్లో నయనతారకు విలాసవంతమైన గృహాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రైవేట్ జెట్ సహా పలు ఖరీదైన ఆస్తులు కూడా ఆమె సొంతమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ.. “రూ.350 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్‌గా పెట్టగలిగితే మా కుటుంబం ఎంతో సంతోషంగా జీవించగలదు” అని అన్నారు. ఆ మొత్తం ద్వారా సంవత్సరానికి సుమారు రూ.21 నుంచి రూ.24 కోట్ల వరకు వడ్డీ వస్తుందని, దాన్ని నెలవారీగా లెక్కిస్తే దాదాపు రూ.2 కోట్ల వరకు వస్తుందని తెలిపారు. రోజుకు సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం ఉంటే కుటుంబ అవసరాలు సౌకర్యంగా నెరవేరుతాయని పేర్కొన్నారు.
ఇప్పుడంతా తాను సంపాదన పెంపుపైనే దృష్టి పెట్టినట్లు విఘ్నేష్ వెల్లడించారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వ్యాపారవేత్తలతో మాట్లాడి వ్యాపార సలహాలు తీసుకుంటానని చెప్పారు. అయితే రూ.350 కోట్ల లక్ష్యానికి ఎంత దగ్గరలో ఉన్నారనే ప్రశ్నకు మాత్రం చిరునవ్వుతో సమాధానం దాటవేశారు.
సోషల్ మీడియాలో మాత్రం నయనతార జీవనశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యక్తిగత మేకప్ సిబ్బంది, స్టైలిస్టులు, భద్రతా సిబ్బంది, ఫోటోషూట్లు, ప్రయాణాలు, విలాసవంతమైన నిర్వహణ ఖర్చులు కలిపితే రోజువారీ ఖర్చులు భారీగానే ఉంటాయని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
అయితే డబ్బు కంటే వ్యక్తిగత గోప్యత, సౌకర్యాలకు నయనతార ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. విఘ్నేష్ వ్యాఖ్యలపై నయనతార మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.




Recent Comments