“మేడారం మహా జాతర” పోస్టర్ ఆవిష్కరణ
– అసెంబ్లీలో మేడారం జాతర సందడి.
– సీఎం రేవంత్‌కు అధికారిక ఆహ్వానం.
– రూ.230 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు.
జనం వాయిస్, హైదరాబాద్ :
తెలంగాణ శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. ప్రపంచ ప్రఖ్యాత ఆదివాసీ జాతర అయిన మేడారం మహా జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రాంగణం మేడారం జాతర వాతావరణంతో కళకళలాడింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ, దేవాదాయ ధర్మాదాయ–అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం ఈఓ వీరస్వామి, సమ్మక్క–సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఇతర పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం కంకణం కట్టి, కండువా కప్పి, బంగారం అందజేసి ప్రముఖులను మహా జాతరకు ఆహ్వానించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు మేడారం జాతర విశిష్టతను కొనియాడారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ నెల 19న సమ్మక్క–సారలమ్మల గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.
సరికొత్తగా అభివృద్ధి చేస్తున్న మేడారం ఆలయ ప్రాంగణం మరో వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మాణం జరుగుతోంది. సమ్మక్క–సారలమ్మల త్యాగాలు, ఆదివాసీ చరిత్ర ప్రతిబింబించేలా ద్వారాలు, ప్రహరీలు రూపొందించారు. ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా మేడారం మహా జాతరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే మేడారం మహా జాతరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులకు అధికారికంగా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖులు ఆదివాసీల అతిపెద్ద జాతరకు తప్పకుండా హాజరవుతామని భరోసా ఇచ్చారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments