EPAPER
Wednesday, October 28, 2026
Google search engine
- Advertisment -spot_img

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి

📰 Generate e-Paper Clip

  • కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.
  • ముగ్గురు నిందితుల అరెస్ట్.
  • బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర సుబోధ్ సింగ్ ముఠాగా గుర్తింపు.
  • దోపిడీకి రెండు నెలల ముందే పలు జిల్లాల్లో నిందితుల రెక్కీ.
  • 161 తులాల బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లిన దుండగులు.
  • జనం వాయిస్, కరీంనగర్, మే 14:

కరీంనగర్ పట్టణంలో పట్టపగలే జరిగి సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా ‘సుబోధ్ సింగ్ గ్యాంగ్’కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించామని, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేశాయని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ దోపిడీలో దుండగులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. జ్యువెలరీ షాపులోకి చొరబడి కాల్పులకు తెగబడటంతో నలుగురు ఉద్యోగులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ గందరగోళం మధ్య నిందితులు 161 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాలను దోచుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ అని, ప్రస్తుతం అతను బీహార్‌లోని పూర్నియా జైలులో ఉంటూనే ఈ దోపిడీకి పకడ్బందీగా పథక రచన చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మకార్‌తో పాటు రవిష్ కుమార్, మెహతాబ్ ఖాన్‌లను పోలీసులు బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు షూటర్లు కాగా, మరొకరు దోపిడీకి అవసరమైన సహాయం అందించిన వ్యక్తిగా గుర్తించారు. నిందితులు దోపిడీకి రెండు నెలల ముందే ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల వంటి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని, చివరకు భద్రతా లోపాలను గమనించి కరీంనగర్‌లోని ఈ షోరూమ్‌ను ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు. దోపిడీ అనంతరం నిందితులు బైక్‌లపై ధర్మపురికి చేరుకుని, అక్కడి నుంచి మూడు బృందాలుగా విడిపోయి రైళ్లు, బస్సుల ద్వారా పరారయ్యారు. నిందితుల నుంచి రూ. 51,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుబోధ్ సింగ్ ముఠాకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దోపిడీలు చేసిన చరిత్ర ఉందని, తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడటం ఇదే మొదటిసారని కమిషనర్ గౌస్ ఆలం వివరించారు. ప్రస్తుతం జైలులో ఉన్న ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నందున, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. బాధితులకు న్యాయం చేసేందుకు, దోచుకెళ్లిన సొత్తును రికవరీ చేసేందుకు పోలీసు యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!