- సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్లు.
- చరిత్రలో తొలిసారి మహిళా ఆపరేటర్లు.
- భారీ డంపర్ల నిర్వహణకు సన్నద్ధం.
- మహిళా సాధికారతకు విప్లవాత్మక అడుగు.
- జనం వాయిస్, గోదావరిఖని, మే 14:
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ తొలిసారిగా మహిళలను హెవీ డంపర్ ఆపరేటర్లుగా నియమించాలని యాజమాన్యం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో సింగరేణిలో మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత పెంచేలా ఈ విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌లో బొగ్గు రవాణా కోసం వినియోగించే 60 నుండి 100 టన్నుల సామర్థ్యం గల భారీ డంపర్లను ఇకపై మహిళా సిబ్బంది కూడా నడపనున్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో కేవలం పురుషులు మాత్రమే ఈ భారీ వాహనాలను నడుపుతున్నారు. శారీరక శ్రమ, ఓపిక, విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉండటంతో ఇప్పటివరకు మహిళలను ఈ విధులకు దూరంగా ఉంచారు. అయితే నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న నేపథ్యంలో వారికి సవాల్‌తో కూడిన బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆసక్తి గల మహిళా ఉద్యోగుల నుండి దరఖాస్తులు కోరగా సుమారు 35 మంది ముందుకు వచ్చారు. భారీ వాహనాలను నడిపేందుకు అవసరమైన హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కోసం కంపెనీయే స్వయంగా వారికి శిక్షణ ఏర్పాట్లు చేసింది.సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ లో కంపెనీ ఖర్చుతోనే మహిళా ఉద్యోగులకు శిక్షణ ఇప్పించారు. మొత్తం 13 మంది మహిళా ఉద్యోగులు హెచ్‌ఎమ్‌వి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యానికి తెలిపారు. రాబోయే డంపర్ ఆపరేటర్ల రిక్రూట్‌మెంట్‌లో వీరికి అవకాశం కల్పించనున్నారు. శారీరక శ్రమతో కూడిన రంగాల్లో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సింగరేణి సంస్థ కొత్త చరిత్రను లిఖిస్తోందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలోనే సింగరేణి గనుల్లో మహిళలు భారీ డంపర్లను నడుపుతూ కనిపించనున్నారు. ప్రారంభంలో ఈ భారీ వాహనాలను నడపడంపై తమకు కొంత ఆందోళన కలిగినప్పటికీ శిక్షణ పొందిన తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసం వచ్చిందని మహిళా ఉద్యోగులు తెలిపారు. మహిళలు అంతరిక్ష యానంలో కూడా రాణిస్తున్నప్పుడు గనుల్లో డంపర్లు నడపడం అసాధ్యమేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు. తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పురుషులతో సమానంగా తాము కూడా కష్టపడగలమని వారు నిరూపించేందుకు సిద్ధమయ్యారు. సింగరేణి మైనింగ్ చరిత్రలో ఇదొక గొప్ప మలుపు అని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సింగరేణిలో ఇప్పటికే మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి పలు చర్యలు తీసుకున్నారు. బెల్లంపల్లిలోని ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్ గనిలో బ్లాస్టింగ్ విభాగం వంటి అత్యంత క్లిష్టమైన విధుల్లో ఇప్పటికే మహిళలు విజయవంతంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మహిళా రెస్క్యూ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మహిళా ఉద్యోగులకు మరిన్ని సవాల్‌తో కూడిన బాధ్యతలను అప్పగిస్తూ వారిని ప్రోత్సహిస్తామని అధికారులు తెలిపారు. సింగరేణి తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మైనింగ్ రంగంలో మహిళా సాధికారతకు ఒక దిక్సూచిగా నిలవనుంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments