పదో తరగతి ఫలితాలు విడుదల… 95.15 శాతం ఉత్తీర్ణత.
బాలికలే మరోసారి ఆధిపత్యం.
ములుగు జిల్లాకు తొలి స్థానం.
వాట్సాప్ ద్వారా ఫలితాల సౌకర్యం.
జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 29:
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాలను సీనియర్ నేత కే కేశవరావు ప్రకటించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలురు 94.07 శాతంతో కొంత వెనుకబడ్డారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల 28 వేల 239 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లా 99.30 శాతంతో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషంగా మారింది.
మీడియం వారీగా ఫలితాలను పరిశీలిస్తే ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు 95.86 శాతంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. తెలుగు మాధ్యమంలో 89.14 శాతం, ఉర్దూ మాధ్యమంలో 86.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది విద్యాశాఖ రెండు కీలక మార్పులు చేసింది. గతంలో మాదిరిగా గ్రేడ్‌ల బదులు, ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు. అదేవిధంగా విద్యార్థుల సౌలభ్యం కోసం తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి 80969 58096 నంబర్‌కు “హాయ్” అని సందేశం పంపితే సరిపోతుంది. అంతేకాకుండా అధికారిక వెబ్‌సైట్లలో కూడా మార్కుల మెమోలను పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం రేపటి నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అదనపు పరీక్షలను జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనుండగా, పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 14 చివరి తేదీగా నిర్ణయించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments