EPAPER
Tuesday, July 14, 2026
Google search engine

సింగరేణికి కేంద్రం భరోసా.

📰 Generate e-Paper Clip

సింగరేణికి కేంద్రం భరోసా.

– కిషన్ రెడ్డి భరోసా యాత్ర కొనసాగింపు.
– బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి విమర్శలు.

జనం వాయిస్, గోదావరిఖని, జూలై 14:

సింగరేణి సంస్థ బలోపేతం, కార్మికుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడిచెర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర రెండో రోజు రామగుండం, గోదావరిఖనిలో కొనసాగింది. యాత్రకు సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన కిషన్ రెడ్డి, సింగరేణి సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడానికి, కార్మికుల భవిష్యత్తు మరింత భద్రంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. తాడిచెర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుతో సంస్థకు దీర్ఘకాలికంగా బొగ్గు నిల్వలు అందుబాటులోకి వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, భద్రత, సంస్థ అభివృద్ధికి అవసరమైన ప్రతి చర్యను కేంద్రం తీసుకుంటోందని స్పష్టం చేశారు. కార్మికుల శ్రమే దేశ పారిశ్రామికాభివృద్ధికి బలమని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను బలోపేతం చేయకుండా ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సంస్థ ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల ఆర్థిక పరిస్థితి బలహీనపడిందని, కార్మికుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగుల జీతాల చెల్లింపులకు కూడా బ్యాంకుల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల విధానాలే కారణమని పేర్కొన్నారు. సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సింగరేణి భరోసా యాత్ర ద్వారా కార్మికులతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. యాత్రలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!