శ్రీశైలంలో హుండీల ఆదాయం రూ.4.89 కోట్లు.
-భారీగా లభించిన విదేశీ కరెన్సీలు.
జనం వాయిస్, శ్రీశైలం, డిసెంబర్ 22:
ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించిన హుండీల లెక్కింపులో దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741 నగదు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. ఈ మొత్తాన్ని భక్తులు గత 27 రోజుల కాలంలో, అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 22 వరకు స్వామి, అమ్మవార్లకు సమర్పించిన కానుకలుగా తెలిపారు. హుండీల్లో దేశీయ కరెన్సీతో పాటు పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీలు కూడా లభించడం విశేషంగా నిలిచింది. వీటిలో అమెరికా డాలర్లు 57, సింగపూర్ డాలర్లు 47, సౌదీ అరేబియా రియాల్స్ 20, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్ 30, ఆస్ట్రేలియా డాలర్లు 80, ఇంగ్లాండ్ పౌండ్లు 15, కెనడా డాలర్లు 25, మలేషియా రింగిట్స్ 14గా ఉన్నాయి. అదనంగా ఖతర్ రియాల్స్ 3, న్యూజిలాండ్ డాలర్లు 5, దక్షిణాఫ్రికా రాండ్స్ 500 విలువైన నోట్లను కూడా విదేశీ భక్తులు హుండీల్లో సమర్పించారు. అయితే అప్రైజర్ హాజరు కాకపోవడంతో హుండీల్లో ఉన్న బంగారు, వెండి నాణేలు, ఆభరణాల లెక్కింపు చేపట్టలేదని దేవస్థానం అధికారులు తెలిపారు. వాటి లెక్కింపును తదుపరి తేదీలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీల లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. శ్రీశైలంలో భక్తుల భక్తి విశ్వాసాలకు ఇది మరో నిదర్శనంగా నిలిచిందని దేవస్థాన వర్గాలు పేర్కొన్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments