EPAPER
Thursday, April 2, 2026
Google search engine

కరీంనగర్ లో ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.

📰 Generate e-Paper Clip

ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.

కరీంనగర్‌లో ఫ్లాగ్ డే నిర్వహణ.

నక్సల్స్‌ ప్రభావ ప్రాంతంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 47 మంది అధికారులకు నివాళులు.

జనం వాయిస్, కరీంనగర్:

పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద మంగళవారంనాడు ‘ఫ్లాగ్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్ హాజరయ్యారు. కరీంనగర్ పోలీసు కమీషనర్  గౌష్ ఆలం ఐపీఎస్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్ మాట్లాడుతూ, పోలీసుల త్యాగం మరువలేనిదని కొనియాడారు. దేశమంతా ప్రజలు పండుగలు కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షిస్తారని తెలిపారు. అటువంటి చిన్న చిన్న త్యాగాల నుండి మొదలుకొని అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులందరికీ నమస్సుమాంజలి తెలియజేశారు.పోలీసు కమీషనర్  గౌష్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేదని, ఎంతో మంది ప్రాణ త్యాగం ఫలితంగానే ఈ రోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో 47 మంది పోలీసు అధికారులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా దేశ రక్షణకోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను స్మరించుకుని నివాళులు అర్పించామని తెలిపారు.దేశవ్యాప్తంగా 191 మందికి పైగా అన్ని విభాగాల పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావని కమీషనర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా, శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారిని స్మరించుకుంటూ ఈ నెల 31 వరకు 10 రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.అనంతరం అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. దేశవ్యాప్తంగా అమరులైన పోలీసులను స్మరించుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ తో పాటు ఇతర పోలీసు అధికారులు మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైనవారంతా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు.అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీస్ కమీషనర్, వారి సేవలను కొనియాడి, వారికి గల సమస్యలను తెలుసుకున్నారు. అట్టి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీపీలు వెంకటరమణ, భీం రావు లతో పాటు కమీషనరేటులోని పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!