నిజామాబాద్‌లో ఉద్రిక్తత..పోలీస్ వాహనంపై మృతదేహం కట్టి నిరసన.
-ప్రేమ వ్యవహారంలో మోసపోయానని యువకుడి ఆత్మహత్య.
-ఏర్గట్ల పోలీస్ స్టేషన్ వైపు ముట్టడి ప్రయత్నం.
-పోలీసుల అడ్డుకట్టపై ఆగ్రహం, రాస్తారోకోతో ఉద్రిక్త పరిస్థితులు.
జనం వాయిస్,నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమించి మోసపోయానని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహాన్ని గ్రామస్థులు పోలీస్ వాహనంపై కట్టి నిరసనకు దిగడం సంచలనంగా మారింది. దోంచందా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఆగ్రహావేశానికి దారితీసింది.

దోంచందాకు చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (29) నవంబర్ 6న ప్రేమ వ్యవహారంలో మోసపోయానన్న బాధతో విషం తాగాడు. మొదటగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించిన కుటుంబ సభ్యులు, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగానే శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలసి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. శుక్రవారం ఉదయం మృతదేహంతో ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే తాళ్లరాంపూర్ రోడ్డులోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనిపట్ల ఆగ్రహించిన బంధువులు, గ్రామస్థులు యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిరసనకారులతో చర్చించి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉన్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments