EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

పర్యటకుల భద్రతకు ప్రత్యేక టూరిజం సేఫ్టీ–ప్రొటెక్షన్ పాలసీ.

📰 Generate e-Paper Clip

పర్యటకుల భద్రతకు ప్రత్యేక టూరిజం సేఫ్టీ–ప్రొటెక్షన్ పాలసీ.

-ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా సురక్షిత రాష్ట్రంగా గుర్తింపు రావాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 22:


రాష్ట్రానికి వచ్చే పర్యటకులకు సంపూర్ణ భద్రత కల్పించడమే లక్ష్యంగా టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా సురక్షిత రాష్ట్రం అన్న భావన దేశ, విదేశీ పర్యటకుల్లో బలంగా కలగాలని ఆయన అన్నారు. సోమవారం పర్యటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పర్యటక, దేవాదాయ, అటవీ, రోడ్లు–భవనాల శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి అనంరెడ్డి, రోడ్లు–భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యటక రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా యువత, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉపాధి పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కుటుంబ పర్యటకులు, మహిళా పర్యటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పర్యటక ప్రదేశాల్లో ప్రత్యేక ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని సూచించారు. హోటల్, ట్రావెల్ నిర్వాహకులు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పర్యటక హాట్ స్పాట్లను గుర్తించి అక్కడ హెలీ టూరిజం, హెలీపోర్టుల అభివృద్ధి చేపట్టాలని, నిర్ణీత కాలవ్యవధిలో ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. అటవీ, ఎకో టూరిజం ప్రాంతాల్లో పర్యటించే వారికి తగిన భద్రత కల్పించడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఒకే తరహా నిర్మాణ శైలిని అభివృద్ధి చేయాలని సూచించారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం వెంబడి అడ్వెంచర్ టూరిజం, కృష్ణా–గోదావరి నదుల్లో బోటు రేసులు, మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం వంటి ప్రాంతాల్లో పర్వతారోహణకు అనువైన సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రకృతి సంపదను వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షణకు చర్యలు తీసుకుంటేనే రాష్ట్రానికి శాశ్వత పర్యటక గుర్తింపు వస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!