జమ్ము–కాశ్మీర్లో అనుమానాస్పద బెలూన్ కలకలం.
– కథువా జిల్లా సరిహద్దు ప్రాంతంలో బెలూన్ స్వాధీనం.
– పాకిస్తాన్ నుంచి వచ్చిందన్న అనుమానాలు.
– ఎల్వోసీ వెంబడి భద్రత మరింత కట్టుదిట్టం.
జనం వాయిస్, శ్రీనగర్:
జమ్ము–కాశ్మీర్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న ఒక బెలూన్ కలకలం రేపింది. ఎరుపు రంగులో, హార్ట్ ఆకారంలో ఉన్న ఈ బెలూన్‌ను కథువా జిల్లా పరిధిలోని పహర్‌పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం స్వాధీనం చేసుకున్నాయి. పహర్‌పూర్ ప్రాంతం భారత్–పాక్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ఈ ఘటన భద్రతా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.
ఇదే తరహాలో ఇటీవల అర్నియా ప్రాంతంలో కూడా ఒక అనుమానాస్పద బెలూన్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో పంపించారన్న అంశాలపై భద్రతా దళాలు సమగ్రంగా విచారణ చేపట్టాయి.
ఇక ఆదివారం పాక్–భారత్ సరిహద్దు అయిన ఎల్వోసీ వద్ద నౌషేరా–రాజౌరి సెక్టార్‌లో కొన్ని డ్రోన్లు అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించాయి. వాటిని గుర్తించిన భారత సైన్యం వెంటనే కౌంటర్ చర్యలు చేపట్టడంతో ఆ డ్రోన్లు తిరిగి వెనక్కు వెళ్లిపోయినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల ఎలాంటి డ్రోన్ భారత భూభాగంలోకి రాలేదని స్థానికులు తెలిపారు.
ఇటీవలి కాలంలో బెలూన్లు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ వంటి అక్రమ వస్తువులను పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా విభాగాలు గట్టి నిఘా కొనసాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments