భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై యూఏఈ–తెలంగాణ కీలక ఒప్పందం.
– దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, యూఏఈ మంత్రి భేటీ.
– ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపకల్పన.
– వేగవంతమైన అమలుకు సంయుక్త టాస్క్ ఫోర్స్ ప్రతిపాదన.
జనం వాయిస్, దావోస్:
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు–2026 సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై భాగస్వామ్యానికి అంగీకరించాయి. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాల్గొంది.
తెలంగాణలో చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై పరస్పర సహకార అవకాశాలపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 దృష్టికోణాన్ని, 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను వివరించారు.
ముప్పై వేల ఎకరాల్లో విస్తరించనున్న భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. కృత్రిమ మేధస్సు, విద్య, వైద్యం, పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, వినోదం వంటి విభిన్న రంగాలకు ప్రత్యేక జోన్లతో ఇది సుస్థిర పట్టణ–పారిశ్రామిక కేంద్రంగా మారనుందని వివరించారు. ఇప్పటికే మారుబేని, సెంబ్‌కార్ప్ వంటి గ్లోబల్ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయని, తాజాగా రిలయన్స్ గ్రూప్ వంతారా సంస్థతో కొత్త జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం వెల్లడించారు.
యూఏఈ ఆర్థిక ఆధునీకరణలో కీలక పాత్ర పోషిస్తున్న అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ తెలంగాణతో భాగస్వామ్యం పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వేగవంతమైన అమలుకు ఇరు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే యూఏఈ ఆహార క్లస్టర్‌తో తెలంగాణ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడితే గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments