- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు.
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
- విమానానికి బాంబు బెదిరింపు మెయిల్.
- సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.
- మూడోసారి అలర్ట్‌తో పెరిగిన ఆందోళన.
- జనం వాయిస్, హైదరాబాద్, మే 17:
- హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం హైఅలర్ట్ ప్రకటించారు. నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఒక అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమాచారం ప్రకారం కౌలాలంపూర్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అయితే ఆ విమానంలో బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి విమానాశ్రయ అధికారులకు మెయిల్ వచ్చింది. విమానం ఎప్పుడైనా పేలిపోయే ప్రమాదం ఉందని, హైదరాబాద్ చేరకముందే ప్రమాదం జరిగే అవకాశం ఉందని మెయిల్‌లో హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా సిబ్బంది, ప్రత్యేక తనిఖీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యవసర చర్యలు చేపట్టారు. అయితే కొంతసేపటి తర్వాత విమానం సురక్షితంగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఆ వెంటనే ప్రయాణికులను జాగ్రత్తగా విమానం నుంచి దింపి, విమానాన్ని ప్రధాన రన్‌వే ప్రాంతానికి దూరంగా తీసుకెళ్లారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారు. ఇటీవల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇలాంటి బెదిరింపు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. రెండు రోజుల క్రితం కూడా మలేసియా నుంచి వస్తున్న ఒక విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్పట్లో అధికారులు తనిఖీలు చేపట్టి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. అంతకుముందు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వస్తున్న మరో అంతర్జాతీయ విమానానికి కూడా ఇలాంటి బెదిరింపు సందేశం అందింది. వరుసగా విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్ ప్రయాణికుల్లో ఆందోళన పెంచుతుండగా, విమానాశ్రయ భద్రతా వ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments