దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీకగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: ప్రధాని మోదీ
– కర్తవ్యపథ్‌లో అద్భుత పరేడ్.
– భారత ప్రజాస్వామ్య బలానికి ప్రతిబింబం.
– భద్రతా దళాల శౌర్యానికి ప్రశంస.
జనం వాయిస్, న్యూఢిల్లీ:
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశరాజధాని ఢిల్లీలో అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన అద్భుతమైన పరేడ్ ముగిసిన అనంతరం, ఈ వేడుకలను “దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీక”గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం ఆయన సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ, గణతంత్ర వేడుకల ద్వారా భారతదేశ ప్రజాస్వామ్య బలం, సాంస్కృతిక వారసత్వ సంపద, దేశాన్ని ఏకతాటిపై నిలిపే ఐక్యత స్పష్టంగా ప్రదర్శితమయ్యాయని పేర్కొన్నారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుందని ప్రధాని తెలిపారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ భారతదేశ అద్భుతమైన భద్రతా వ్యవస్థను ప్రతిబింబించిందని, దేశ సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యం, పౌరులను రక్షించడంలో ఉన్న అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనమని మరో పోస్ట్‌లో వివరించారు. మన భద్రతా దళాలు నిజంగా దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. పరేడ్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ పరేడ్‌లో భారత సైన్యం తొలిసారిగా ‘బ్యాటిల్ అర్రే’ ఫార్మాట్‌లో తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించింది. స్వదేశీ ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు, వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కర్తవ్యపథ్‌లో కనువిందు చేశాయి. పరేడ్ ముగిసిన అనంతరం ప్రతి ఏటా మాదిరిగానే ప్రధాని మోదీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి కర్తవ్యపథ్‌లో నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఆయనను చూసిన ప్రజలు ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ–మోదీ’ నినాదాలతో హోరెత్తించారు. రాజస్థానీ సంప్రదాయ తలపాగా, నెమలి ఈకల అలంకరణతో మోదీ తన ప్రత్యేక వస్త్రధారణతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments