ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్‌కు అలాగే వచ్చింది: కేటీఆర్.
– సిట్ నోటీసులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.
– పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే విచారణలు.
– భద్రత, కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీత.
– కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన బీఆర్ఎస్.
జనం వాయిస్, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలాగే వచ్చేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిన్న రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులే గుర్తుకొస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, మేడారం జాతర ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కేటీఆర్ అన్నారు. మొదట వ్యాపారవేత్తలు, ఆ తర్వాత సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి, ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు లేదని కేసీఆర్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. పాలనపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
ఈ వ్యవహారంలో సజ్జనార్ తీర్పు చెప్పడానికి జడ్జి కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చిన అభియోగాలపై కోర్టులే తేల్చుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పట్టపగలు కాల్పులు, దోపిడీ ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ సాగుతోందని ఆరోపిస్తూ, సింగరేణి కుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదన్నారు. బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణ కోరుతుంటే ఎందుకు వెనక్కి పోతున్నారని ప్రశ్నించారు. సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే నిజాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిలదీస్తోందన్న కారణంతోనే సిట్‌ల పేరిట విచారణలు చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పైశాచిక ఆనందం కోసం కేసీఆర్‌ను గంటల తరబడి విచారణ పేరుతో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై కూడా కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కుదింపులు, ఎరువులు, ఆహార రాయితీ, స్వచ్ఛ భారత్ నిధుల కోతలను ప్రస్తావిస్తూ, బయో ఫార్మా తయారీకి రూ.10 వేల కోట్లు కేటాయించిన కేంద్రం హైదరాబాద్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన సీఎం సాధించింది ఏమిటని ప్రశ్నిస్తూ, రెండు పార్టీల నుంచి ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ దక్కలేదన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments