పొలం వద్ద మహిళా న్యాయవాది హత్య.
– కుటుంబ కలహం ప్రాణం తీసింది.
– సోదరుడే కత్తితో దాడి.
జనం వాయిస్, రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో స్వంత సోదరుడే ఆమెను కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు కుటుంబంలో ఆస్తి సంబంధిత వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పొలం వద్ద కుటుంబ సభ్యుల మధ్య పంచాయితీ జరుగుతుండగా, మాటా మాటా పెరిగి వాగ్వాదంగా మారింది. ఆ క్రమంలో సోదరుడు కత్తితో ఆమె మెడపై దాడి చేయడంతో స్వప్న అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందారు. స్థానికులు ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ స్వప్న హత్యను నిరసిస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments