అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు..మంత్రి శ్రీధర్ బాబు.
– 480 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాల పంపిణీ.
– కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన మంత్రి.
– అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ.
జనం వాయిస్, మంథని, ఏప్రిల్ 15:
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించడమే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం మంథని నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వ సాయాన్ని అందజేస్తూ, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మంథని మున్సిపాలిటీతో పాటు మంథని, ముత్తారం, కమాన్ పూర్, రామగిరి మండలాలకు చెందిన 480 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. ఏళ్ల తరబడి సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ పథకం ఒక వరమని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గవ్యాప్తంగా దశలవారీగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
సంక్షేమ పథకాల అమలులో భాగంగా 129 మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 169 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1.84 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. పేదల కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ నిధులను త్వరితగతిన మంజూరు చేస్తున్నామని మంత్రి వివరించారు. విద్య వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 160 మంది అంగన్‌వాడీ టీచర్లకు మంత్రి శ్రీధర్ బాబు స్మార్ట్ మొబైల్ ఫోన్లను అందజేశారు. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ, సమాచార సేకరణ మరియు రిపోర్టింగ్ ప్రక్రియ డిజిటల్ విధానంలో సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించాలని టీచర్లకు సూచించారు. మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హత ఉండి పథకాలు అందని వారుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మంత్రి పర్యటనతో మంథని నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments