EPAPER
Saturday, May 2, 2026
Google search engine

చెరువుల నుండి మట్టి రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలు.

📰 Generate e-Paper Clip

చెరువుల నుండి మట్టి రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలు.

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

– మూడు చెరువులకు మాత్రమే అనుమతులు – మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌ఓసీలు.

– ప్రతి వాహనానికి ఫోటోగ్రఫీ, రసీదు తప్పనిసరి.

– అధిక లోడుతో రవాణా నిషేధం – అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు.

– మానేరువాగు పరిధిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు.

జనం వాయిస్, పెద్దపల్లి, మే 02:

జిల్లాలో ఇటుక బట్టీలకు చెరువుల నుండి మట్టి (గ్రావెల్) రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో మట్టి (గ్రావెల్), ఇసుక రవాణాపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  మాట్లాడుతూ, నీటి మట్టం తక్కువగా ఉన్న చెరువుల నుండి మట్టి తవ్వకాలకు గత సంవత్సరం సెస్ వసూలు చేసి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విధానాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కొడురుపాక చెరువు, రాయకుంట చెరువు, ముత్తారం చెరువుల నుండి మట్టి రవాణా కోసం 15 ఇటుక బట్టీలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రారంభ దశలో ఈ మూడు చెరువులకు మాత్రమే అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. నీరు లేని చెరువులను మాత్రమే మట్టి తవ్వకాలకు పరిగణనలోకి తీసుకుని, సాగునీటి శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌ఓసీలు మంజూరు చేయాలని ఆదేశించారు. మట్టి రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతి వాహన రవాణాను ఫోటోగ్రఫీ చేయాలని, ప్రతి వాహనానికి రసీదు జారీ చేయాలని తెలిపారు. వాహనాలు అధిక లోడుతో రవాణా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మానేరువాగు పరిధిలో పెద్దపల్లి వైపు ఎలాంటి ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని, కరీంనగర్ వైపు జరుగుతున్న తవ్వకాల నేపథ్యంలో అక్కడి జేసీబీలు పెద్దపల్లి వైపు రాకుండా కఠినంగా హెచ్చరించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జేసీబీలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.ఈ అంశంపై జేసీబీ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గనుల శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓలు సురేష్, బి. గంగయ్య తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!