జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డా. ప్రవీణ్ కు డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘన సత్కారం.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 01:
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ చౌదరిగూడలోని సురవి హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ ని డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 1న దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించడం వెనుక గొప్ప ఉద్దేశ్యం ఉందన్నారు. భారతదేశ ప్రఖ్యాత వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారత రత్న డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ గారి జననం,1882, మరణం1962 రెండూ జూలై 1వ తేదీన జరిగిన సందర్భంగా ఆయన విశిష్ట సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు తమ జ్ఞానం, నైపుణ్యం, మానవతా దృక్పథంతో ప్రజల ప్రాణాలను కాపాడుతూ సమాజానికి అపూర్వమైన సేవలు అందిస్తున్నారని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులు వంటి క్లిష్ట సమయాల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించే వైద్యుల సేవలు చిరస్మరణీయమని అన్నారు.దురదృష్టవశాత్తు చికిత్స విజయవంతం కాకపోతే వైద్యులపై దాడులు చేయడం పనికిరాదని,వారు కూడ సగటు మనుషులేనని గుర్తించాలని,చౌదరిగూడ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రవీణ్ గారిని జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సత్కరించడం తమ అసోసియేషన్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతి వైద్యుడికి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలు మరెన్నో సంవత్సరాలు ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. సత్కారానికి స్పందించిన డాక్టర్ ప్రవీణ్ గారు, తనపై చూపిన గౌరవానికి డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత అంకితభావంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పదాదికారులైన బంగారు రాజయ్య, రాజనర్సు, కొట్టే మల్లయ్య, లక్ష్మీ నారాయణ,బీరయ్య, ఎం.డి.రఫిక్, ప్రభాకర్, సత్యనారాయణ, మల్లేష్ సీనియర్ సిటిజన్లు, స్థానిక ప్రముఖులు పాల్గొని డాక్టర్ ప్రవీణ్ గారిని అభినందించి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments