పీవీకి గౌరవం ఇదేనా? సోనియాపై వాణీదేవి ప్రశ్నాస్త్రం!
ఢిల్లీలో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు? సోనియా ఆత్మకథపై పీవీ కుటుంబం తీవ్ర అభ్యంతరం అది చారిత్రక తప్పిదాలతో కూడిన అబద్ధాల పుట్ట: ఎన్వీ సుభాష్
జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ విడుదల నేపథ్యంలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పుస్తకంలో పీవీపై సోనియాగాంధీ గౌరవం వ్యక్తం చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలపై పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రశ్నలు సంధించారు. మరోవైపు పీవీ మనవడు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆత్మకథలోని అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో ఎందుకు చేయలేదు?
సోనియాగాంధీ ఆత్మకథను తాను ఇంకా చదవలేదని, అయితే పీవీతో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని సోనియా పేర్కొన్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్నానని వాణీదేవి తెలిపారు. పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవలందించడంతో పాటు దేశ ప్రధానిగా పనిచేశారని గుర్తుచేశారు. అలాంటి నేత అంత్యక్రియలను దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. స్వతంత్ర భారత చరిత్రలో మరే ప్రధానికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని పేర్కొంటూ, దీనిని గౌరవంగా భావించాలా? అవమానంగా పరిగణించాలా? అని నిలదీశారు.
ఆత్మకథలో చారిత్రక తప్పిదాలు: సుభాష్
పీవీ మనవడు ఎన్వీ సుభాష్ సైతం సోనియాగాంధీ ఆత్మకథపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పుస్తకం అసత్యాలతో నిండిపోయిందని, చారిత్రక తప్పిదాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలను పుస్తకంలో ఉద్దేశపూర్వకంగా విస్మరించారని విమర్శించారు. గాంధీ కుటుంబానికి చెందిన వారిని మాత్రమే ప్రాధాన్యంగా చూపిస్తూ, ఇతర ముఖ్య నేతలను విస్మరించడం ఆ కుటుంబానికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు.
మరోసారి తెరపైకి పీవీకి జరిగిన అవమానంపై చర్చ
సోనియాగాంధీ ఆత్మకథ విడుదలతో పీవీ నరసింహారావు పట్ల అప్పటి కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరుపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. పీవీ కుటుంబ సభ్యుల తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments