తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథి.. మీనాక్షి స్థానంలో బీఎం సందీప్
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా బీఎం సందీప్ నియామకం.
- ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్థానంలో బాధ్యతలు.
- ఖర్గే ఆమోదంతో ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల.
- ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న సందీప్.
- మీనాక్షి సేవలను అభినందించిన కాంగ్రెస్ పార్టీ.
జనం వాయిస్, తెలంగాణ, నవంబర్ 15:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వ్యవహారాల ఇన్చార్జిగా బీఎం సందీప్‌ను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ స్పష్టం చేసింది.
కొత్త ఇన్చార్జిగా నియమితులైన సందీప్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతానికి, సంస్థాగత నిర్మాణానికి విశేష కృషి చేశారని, సందీప్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన బీఎం సందీప్‌కు ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరుంది. యూత్ కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, చిక్‌మగళూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. గతంలో ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ వంటి ప్రాంతాల బాధ్యతలు చూశారు. ఇటీవల కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఇప్పటివరకు సంస్థాగత పదవుల్లోనే కొనసాగుతూ, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఫిబ్రవరి 2025లో తెలంగాణ ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్, ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. అయితే, ఆమె వైదొలగడానికి గల కారణాలను ఏఐసీసీ అధికారికంగా వెల్లడించలేదు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మార్పు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments