చికెన్ ధరలకు రెక్కలు.. సామాన్యులకు షాక్
జనం వాయిస్, హైదరాబాద్, మే 15:
రాష్ట్రంలో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం వరకు అందుబాటులో ఉన్న ధరలు ఇప్పుడు అమాంతం పెరగడంతో సామాన్యుల జేబుపై అదనపు భారం పడుతోంది. గతంలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.280 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.330 మార్కును దాటింది. మరోవైపు మటన్ ధర కూడా కిలోకు వెయ్యి రూపాయలకు పైగా కొనసాగుతోంది. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం, తీవ్ర ఎండలు చికెన్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు చనిపోవడం వల్ల మార్కెట్లో సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది.
సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి జూన్ చివరి వరకు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లైవ్ కోడి ధర కిలోకు రూ.210 వరకు ఉంది. స్కిన్‌తో ఉన్న చికెన్ రూ.220 వద్ద విక్రయిస్తుండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.330కు చేరింది. ఎముకలు లేని బోన్‌లెస్ చికెన్ అయితే ఏకంగా కిలో రూ.660 వరకు అమ్ముతున్నారు.
గుడ్ల ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం డజను గుడ్లు రూ.80 వరకు విక్రయించబడుతున్నాయి. దీంతో సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments