- నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ ఆందోళన.
- – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు.
- – పారదర్శక దర్యాప్తు జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి.
- జనం వాయిస్, హైదరాబాద్, మే 15:
నీట్ యూజీ–2026 పరీక్ష రద్దు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయిందని పేర్కొన్నారు. పోటీ పరీక్షలు ప్రతిభకు వేదిక కావాల్సిందిపోయి ఆందోళన, అస్థిరతకు కారణమవుతున్నాయని విమర్శించారు. మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించిన నీట్ యూజీ–2026 పరీక్షకు సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు పరీక్ష రద్దు కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకలు విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడిన వ్యక్తులు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి స్థాయి, ప్రభావం ఎలా ఉన్నా చట్టపరమైన కఠిన శిక్షలు విధించాలని కోరారు. నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా, వేగవంతంగా దర్యాప్తు జరపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వ్యవస్థలోని వైఫల్యాల కారణంగా అమాయక విద్యార్థులు మళ్లీ మళ్లీ నష్టపోకూడదని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో సాంకేతిక భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు నీట్ కోసం ఎంతో కష్టపడి, ఆర్థిక భారం భరిస్తూ సిద్ధమవుతున్నారని సీఎం గుర్తుచేశారు. కుటుంబాల ఆశలు, విద్యార్థుల శ్రమను ఇలాంటి ఘటనలు దెబ్బతీస్తున్నాయని తెలిపారు. పోటీ పరీక్షలు యువతకు అవకాశాల ద్వారంగా ఉండాలే తప్ప ఆందోళనకు కారణం కాకూడదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా వ్యవస్థలు, సాంకేతిక రక్షణ చర్యలు, సంస్థాగత బాధ్యతలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments