EPAPER
Sunday, July 5, 2026
Google search engine

కవితకు ఈసీ షాక్..!

📰 Generate e-Paper Clip

కవితకు ఈసీ షాక్..!

పార్టీ పేరుపై అభ్యంతరాలు.
కొత్త పేర్లు కోరిన ఈసీ.

జనం వాయిస్, హైదరాబాద్, జులై 4:

సొంత రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రస్థానం ప్రారంభించాలనుకుంటున్న కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక షాక్ ఇచ్చింది. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో పార్టీ నమోదు కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించిన ఎన్నికల సంఘం, అదే పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పార్టీ నమోదు ముందుకు సాగాలంటే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం కవితకు పంపిన అధికారిక లేఖలో నిర్ణీత గడువులోగా కొత్త పేర్లను సూచించాలని పేర్కొంది. లేదంటే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించింది. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ నిర్ణయంపై కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం పేర్కొన్న అభ్యంతరాలపై ఇప్పటికే తమవైపు నుంచి పూర్తి వివరణ ఇచ్చామని తెలిపారు. ప్రత్యామ్నాయ పేర్లు పంపే ఉద్దేశం తమకు లేదని, ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతోనే పార్టీని నమోదు చేయించుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించారు.
కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో కవిత ఐదు పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’, ‘తెలంగాణ జాగృతి’, ‘తెలంగాణ రక్షణ సేన’, ‘తెలంగాణ రాష్ట్ర జాగృతి’, ‘తెలంగాణ ప్రజా శక్తి’ పేర్లను పరిశీలన కోసం పంపించారు. అనంతరం ఏప్రిల్ 25న నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరును ప్రకటించి పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అయితే మూడు రోజుల వ్యవధిలోనే పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చుతూ ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. అనంతరం ఈ పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. ‘రాష్ట్ర సేన’ నుంచి ‘రక్షణ సేన’గా పేరు మార్చడంపై అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది.
ప్రస్తుతం ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతోనే కవిత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమీకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు రావడం, ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఎన్నికల సంఘం ఆదేశించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు అదే పేరును కొనసాగించేందుకు కవిత న్యాయపోరాటం చేస్తారా, లేక కొత్త పేరును ఎంచుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!