టెక్నాలజీకి తలపోటు తెచ్చిన ‘గుండు’.
హాజరు కోసం కూలీ వినూత్న ఉపాయం!.
సాఫ్ట్‌వేర్ కంటికి ఆనని కార్మికుడి మొఖం.
పక్కనున్న మహిళ జుట్టుతో ‘కవర్’ చేసిన వైనం.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో విచిత్ర ఘటన.
మహబూబాబాద్, మే 29 (జనం వాయిస్):
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన ప్రభుత్వ ఆధునిక సాంకేతికత.., ఒక సాదాసీదా కూలీ ఉపాయం ముందు చిన్నబోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్‌లోని లోపాలను, ఒక కార్మికుడి ‘గుండు’ బట్టబయలు చేసింది. గుండుతో ఉన్న కార్మికుడిని గుర్తించడానికి నిరాకరించిన సాఫ్ట్‌వేర్.., పక్కనే ఉన్న మహిళ జుట్టును అతని తలపై పరచగానే చకచకా అటెండెన్స్ నమోదు చేసుకున్న విచిత్ర ఉదంతం మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
అంజన్న మొక్కుతో వచ్చిన తిప్పలు :
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ఉపాధి హామీ కార్మికుడు ఇటీవల కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నాడు. తన మొక్కుబడిలో భాగంగా స్వామివారికి తలనీలాలు సమర్పించాడు (గుండు చేయించుకున్నాడు). మొక్కు తీర్చుకున్న అనంతరం శ్రీనివాస్ యథావిధిగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు హాజరయ్యాడు.
గుర్తించని యాప్ – జుట్టుతో ‘కవరింగ్’ :
నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీలు గ్రూపుగా నిలబడి మొబైల్ యాప్ ద్వారా ఫోటో దిగి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాస్ కూడా ఫోటో దిగేందుకు కెమెరా ముందుకు రాగా, అతని తలపై జుట్టు లేకపోవడం (గుండుతో ఉండడం) వల్ల సాఫ్ట్‌వేర్ అతని ముఖాన్ని గుర్తించలేదు. ఎంత ప్రయత్నించినా అటెండెన్స్ నమోదు కాకపోవడంతో శ్రీనివాస్ ఒక వినూత్న ఆలోచన చేశాడు. పక్కనే నిలబడిన ఒక మహిళా కూలీ జుట్టును తన గుండుపైకి వచ్చేలా కప్పి, వెంటనే ఫోటో క్లిక్ మనిపించారు. చిత్రం ఏమిటంటే.. అంతసేపు మొరాయించిన సాఫ్ట్‌వేర్, జుట్టు కనిపించగానే శ్రీనివాస్ ముఖాన్ని గుర్తించి హాజరును అంగీకరించింది.
వైరల్‌గా మారిన ఉదంతం :
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “రూ. కోట్లు పెట్టి తయారు చేసిన సాఫ్ట్‌వేర్ చేయలేని పనిని, మహిళ జుట్టు చేసి చూపించింది” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన సాంకేతికతలోని లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కూలీలు పడుతున్న ఇబ్బందులకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సాఫ్ట్‌వేర్ లోపాలను సరిచేయాలని కార్మికులు కోరుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments