EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

దొంగ సర్టిఫికెట్ల దందా..!?

📰 Generate e-Paper Clip

దొంగ సర్టిఫికెట్ల దందా..!?

  • మహబూబాబాద్ కబడ్డీ అసోసియేషన్‌లో అవినీతి బాగోతం.
  • ఆర్మీ జవాన్, సీనియర్ ప్లేయర్ డబ్బులు నొక్కేసిన వైనం.
  • ప్రతిభావంతులకు మొండిచేయి.. పైసలిస్తేనే సెలక్షన్స్?
  • రాష్ట్ర అసోసియేషన్‌కు వినతిపత్రం సమర్పించిన జాతీయ ఆటగాడు పిట్టల వీరన్న గౌడ్.

మహబూబాబాద్, సెప్టెంబర్ 23 (జనం వాయిస్):

మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌లో భారీ అక్రమాలు, నిధుల దుర్వినియోగం కలకలం రేపుతున్నాయి. క్రీడాకారుల అభివృద్ధిని గాలికొదిలేసి, అసోసియేషన్ ముసుగులో కొందరు దొంగ సర్టిఫికెట్ల దందాకు తెరలేపారని ఆర్మీ జవాన్, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు పిట్టల వీరన్న గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డిలకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు పంపారు.

దాతల సొమ్ముకూ దిగమింగుడు!

గతేడాది కరీంనగర్ జిల్లాలో జరిగిన జూనియర్ కబడ్డీ పోటీలకు వెళ్లే జిల్లా క్రీడాకారులకు దుస్తుల (కిట్స్) కొనుగోలు కోసం జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు సహాయం కోరారు. ఒక సీనియర్ క్రీడాకారుడిగా, దాతగా ముందుకొచ్చిన వీరన్న.. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందే వీరన్నకు ఫోన్ పే ద్వారా రూ.7,800 పంపించారు. అయితే, పోటీలకు వెళ్లిన బాలబాలికలకు ఎలాంటి దుస్తులు ఇవ్వకపోగా, ఆ డబ్బును సైతం సదరు కమిటీ సభ్యులు సొంతానికి వాడుకున్నారని వీరన్న ఆరోపించారు. దీనిపై నిలదీస్తే.. “నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బాధ్యతారాహిత్యంగా, దురహంకారంతో సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు.

అర్హుల పొట్టగొట్టి.. దొంగ సర్టిఫికెట్ల అమ్మకాలు!

జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది వెంకట్ రెడ్డి, కార్యదర్శి సందే వీరన్న, వ్యాయామ ఉపాధ్యాయుడు చాంప్లా నాయక్, గందసిరి శ్రీను, తోట యాకంబ్రం తదితరులు కలిసి అసోసియేషన్‌ను అక్రమాల అడ్డాగా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు కబడ్డీ ఆడని వారికి దొంగ సర్టిఫికెట్లు సృష్టించి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ల కోసం, ఇతర సర్టిఫికెట్ల కోసం క్రీడలతో సంబంధం లేని తమ సొంత పిల్లలను, లంచాలు ఇచ్చిన వారిని నామమాత్రంగా పోటీలకు తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సెలక్షన్స్‌లో తీవ్ర అన్యాయం.. గిరిజన క్రీడాకారుల భవిష్యత్తు అంధకారం!

ఈ నెల 20 (ఆదివారం) నాడు మహబూబాబాద్ జిల్లా జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ ఎంపికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని వీరన్న పేర్కొన్నారు. మంగోళిగూడెం, జయ్యారం గ్రామాలకు చెందిన నిజమైన, ప్రతిభావంతులైన క్రీడాకారులను కావాలనే పక్కనబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సదరు పీఈటీలు తమ పాఠశాల విద్యార్థులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పైరవీలు చేసుకున్నారని, ఇది సీనియర్ క్రీడాకారులు తలదించుకునే చర్య అని ఆవేదన చెందారు.  మహబూబాబాద్ వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన క్రీడాకారులకు కబడ్డీ అంటే ఎంతో ప్రాణమని, ఇలాంటి అవినీతి కమిటీల వల్ల మట్టిలో పెరిగే మాణిక్యాల లాంటి రూరల్ ప్లేయర్స్ కనుమరుగైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి అసోసియేషన్ బాధ్యతలు ఎలా అప్పగించారని రాష్ట్ర కమిటీని ప్రశ్నించారు. తక్షణమే ఈ కమిటీపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా క్రీడాకారులకు న్యాయం చేయాలని ఆర్మీ జవాన్ పిట్టల వీరన్న డిమాండ్ చేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!