కరవు వేళ గ్రామీణ కూలీలకు కొత్త జాబ్‌కార్డులు.
15 రోజుల్లో జారీకి ప్రభుత్వం ఆదేశాలు.
18 జిల్లాల్లో 265 మండలాలు కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు.
జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబరు 5:
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులైన గ్రామీణ కుటుంబాలకు 15 రోజుల్లోనే జాబ్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ పనులు తగ్గడంతో గ్రామీణ కూలీలకు పనిదినాలు, ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులను విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే 18 జిల్లాల్లోని 265 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల్లో పంటల సాగు తగ్గడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉపాధి హామీ పనులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
ప్రతి గ్రామంలో ఉపాధి అవసరమున్న కుటుంబాలను గుర్తించి రోజుకు 100 నుంచి 150 మందికి పనులు కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే జాబ్‌కార్డులు ఉన్న కుటుంబాలతో పాటు కొత్తగా ఉపాధి కోరుకునే వారిని కూడా పథకంలోకి తీసుకురావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా కరవు ప్రభావిత మండలాల్లో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52.46 లక్షల కుటుంబాలకు చెందిన 1.08 కోట్ల మంది జాబ్‌కార్డులు కలిగి ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా ఉపాధి కోరుకునే కుటుంబాలను కూడా పథకంలోకి చేర్చడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో ఆదాయ నష్టాన్ని తగ్గించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
18 ఏళ్లు నిండిన గ్రామీణులు జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్‌కార్డు, ఫొటోను సమర్పించాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్న అనంతరం పరిశీలన కోసం మండల కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ అర్హతను నిర్ధారించిన తర్వాత జాబ్‌కార్డు జారీ చేస్తారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి కొత్త దరఖాస్తుదారులకు 15 రోజుల్లో కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments