EPAPER
Monday, June 22, 2026
Google search engine

వారికి రైతు భరోసా కట్.. రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.

📰 Generate e-Paper Clip

వారికి రైతు భరోసా కట్.. రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.

జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 22:

తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

ఆర్థిక భారం ఎక్కువైనా సరే.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.ఈ విడతలో మొత్తం 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 9,000 కోట్లను జమ చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.

గత యాసంగి సీజన్‌లో కేవలం రెండు ఎకరాల లోపు ఉన్న వారికే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా అందరికీ ఒకేసారి నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ నిధుల కొరత ఏమైనా ఎదురైతే.. మొదట ఎకరం చొప్పున ప్రారంభించి, 9 రోజుల్లో పూర్తిగా పంపిణీ పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకుంది. గత ప్రభుత్వంలా కాకుండా.. ప్రజల సొమ్ము వృథా కాకుండా కేవలం నిజమైన, సాగు చేసే రైతులకే ఈ సాయం అందేలా రేవంత్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోంది. రాష్ట్రంలో ఉన్న 1.50 కోట్ల ఎకరాల భూమిలో సాగుకు పనికిరాని పడావు భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, కాలువలు, కుంటలు, బీడు భూములు ఉన్న 20 నుంచి 25 లక్షల ఎకరాలను భరోసా జాబితా నుంచి ఇప్పటికే తొలగించనున్నారు.

ధనవంతులైన పెద్ద రైతులకు కాకుండా పేద, మధ్యతరగతి రైతులకు లబ్ధి చేకూర్చేలా ఈ వానాకాలం సీజన్ నుంచి 7.20 గుంటల వరకు భూమి ఉన్న వారికే భరోసా సాయం పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారిని ఈ జాబితా నుంచి మినహాయించే అవకాశం ఉంది. పత్తి వంటి పంటలు రబీలో సాగు చేయనందున.. రైతు భరోసాను కేవలం ఒకే ఒక ప్రధాన ఖరీఫ్ సీజన్‌కే పరిమితం చేయాలా? అనే కోణంలోనూ ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఎకరానికి రూ. 15 వేలు ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తిరుగుండదని, అలాగే కౌలు రైతులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కొందరు మంత్రులు సీఎంకు ప్రతిపాదనలు పెట్టారు.

ఇకపై రైతు భరోసాలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం హైటెక్ టెక్నాలజీని వాడుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని శాటిలైట్ చిత్రాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించారు.ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో ఏ గ్రామంలో, ఏ సర్వే నంబర్‌లో, ఏ పంట వేశారనేది 95 శాతం ఖచ్చితత్వంతో గుర్తించారు.

పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకు 5 గ్రామాలను ఎంపిక చేసి ఏఈఓ లతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించగా శాటిలైట్ వివరాలు, క్షేత్రస్థాయి వివరాలు ఒక్కటిగానే వచ్చాయి. దీనివల్ల కేవలం పంట సాగు చేసిన వారికే ప్రభుత్వ పథకాలు అందుతాయి. అంతేకాకుండా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే నేరుగా నష్టపరిహారం అందించడానికి, విత్తనాలు-ఎరువులు ముందే సిద్ధం చేసుకోవడానికి ఈ డేటా ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ విప్లవాత్మక మార్పులతో నిజమైన పేద రైతులకు పూర్తి స్థాయిలో భరోసా దక్కనుందని స్పష్టమవుతోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!