EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

సీతాఫలానికి కష్టకాలం.. తగ్గిన దిగుబడి.. పెరిగిన ధరలు.

📰 Generate e-Paper Clip

సీతాఫలానికి కష్టకాలం.. తగ్గిన దిగుబడి.. పెరిగిన ధరలు.

  • ఎల్‌నినో ప్రభావంతో పూత, పిందె దశలోనే దెబ్బతిన్న పంట.
  • కాయలు లేక ఉపాధి కోల్పోతున్న గ్రామీణ ప్రజలు.
  • ఖాళీగా ఉంటున్న మహిళా సంఘాల ప్రాసెసింగ్‌ కేంద్రాలు.

జనం వాయిస్, వెబ్ డెస్క్, అక్టోబరు 7:

ఒకప్పుడు గుట్టలు, బంజరు భూములు, అటవీ ప్రాంతాల్లో విస్తారంగా కనిపించిన సీతాఫలాలు ఇప్పుడు అరుదుగా మారుతున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఉష్ణోగ్రతలు సీతాఫలాల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పూత దశ నుంచే ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో పిందెలు రాలిపోతున్నాయి. చెట్లకు మిగిలిన కాయలు సైతం పూర్తిస్థాయిలో ఎదగకుండానే దెబ్బతింటున్నాయి.

దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌లో సీతాఫలాల సరఫరా తగ్గి ధరలు పెరిగాయి. సాధారణంగా ఒక్కో చెట్టుకు 50 నుంచి 60 కాయల వరకు కాసే పరిస్థితి ఉండగా, ఈసారి చాలా చెట్లకు పది కాయలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో పూత పిందెలుగా మారే సమయంలో తగిన వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగడం వల్ల పిందెలు రాలిపోయాయి.

సీతాఫలాల కొరతతో పట్టణ ప్రాంతాల్లో ధరలు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి నాణ్యత, బరువును బట్టి ఒక్కో పండు రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సీతాఫలాలను సేకరించి విక్రయించే కుటుంబాలకు కూడా ఈ పరిస్థితి ఉపాధిపై ప్రభావం చూపుతోంది.

సీతాఫలాల సేకరణ అనంతరం వాటిని ప్రాసెసింగ్‌ చేసి విక్రయించే మహిళా సంఘాలపైనా ప్రభావం పడింది. గతేడాది ఇదే సమయంలో ప్రాసెసింగ్‌ పనులు జోరుగా సాగగా, ఈసారి సరిపడా పండ్లు అందుబాటులో లేక పనులు మందగించాయి. మరోవైపు గుట్టల తొలగింపు, క్వారీల విస్తరణ, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భూముల వినియోగంలో మార్పులతో సహజంగా పెరిగే సీతాఫలం చెట్ల విస్తీర్ణం కూడా తగ్గుతోంది.

వాతావరణ పరిస్థితులతో పాటు సహజ సీతాఫలం చెట్ల సంఖ్య తగ్గిపోవడం భవిష్యత్తులో ఈ పండ్ల లభ్యతపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే సీజన్‌లోనైనా వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించి సీతాఫలం దిగుబడి పెరుగుతుందా అన్నది చూడాలి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!