సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడతాం : టీఆర్ఎస్ చీఫ్ కవిత.
బాయిబాట కార్యక్రమంలో కార్మికులతో ముఖాముఖి.
ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు.
అండర్ గ్రౌండ్ మైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్.
జనం వాయిస్, గోదావరిఖని, జూన్ 17:
సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా గోదావరిఖనిలోని 11 ఇంక్లైన్ గనుల కార్మికులతో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం తమ పార్టీ, హెచ్ఎంఎస్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కవిత అన్నారు. కార్మికులకు ఏ రాజకీయ పార్టీ నాయకులతోనైనా మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే సింగరేణి యాజమాన్యం, పోలీసులు కలిసి ప్రతిపక్ష నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను వినకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సింగరేణిలో కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు, ప్రాథమిక సౌకర్యాలు సరైన స్థాయిలో అందడం లేదని కవిత విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు నాణ్యమైన గ్లౌజులు, షూస్, యంత్రాలు అందించడం లేదని ఆరోపించారు. కనీస అవసరాలైన తాగునీరు, గాలి, భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కవిత, తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం పనిచేయాల్సి ఉండగా, బలహీనతను ప్రదర్శించే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదను, హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సింగరేణి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మూతపడుతున్న గనులను పునరుద్ధరించేందుకు చర్యలు అవసరమన్నారు. సింగరేణి కార్మికుల పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత కోరారు. సింగరేణి నిధులతో నిర్మించిన వైద్య కళాశాలల్లో కార్మికుల పిల్లలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తమకు సమాచారం అందించాలని, వారి కోసం ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments