ప్రధాని పర్యటనకు ముందు తుపాకీ కలకలం.
పీఎంవో అధికారినంటూ నకిలీ గుర్తింపు కార్డుతో ఎంట్రీకి యత్నం.
జనం వాయిస్, ముంబై, సెప్టెంబరు 09:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు భద్రతా పరంగా కలకలం రేగింది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ప్రధాని పాల్గొననున్న కార్యక్రమానికి సంబంధించిన ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం.
పోలీసుల తనిఖీల్లో అతని వద్ద నకిలీ గుర్తింపు కార్డు లభించగా.. అతనితో వచ్చిన వ్యక్తి వద్ద తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నకిలీ గుర్తింపు కార్డుతో పట్టుబడిన వ్యక్తిని 24 ఏళ్ల రోహన్ పరేఖ్‌గా గుర్తించారు. అతనితో ఉన్న వ్యక్తి అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది తనిఖీల సందర్భంగా గుర్తింపు కార్డుపై అనుమానం రావడంతో లోతుగా పరిశీలించగా అది నకిలీదని తేలింది. అనంతరం అతనితో ఉన్న వ్యక్తి వద్ద తుపాకీని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ గుర్తింపు కార్డు ఎలా పొందాడు? పీఎంవో అధికారినని చెప్పుకోవడానికి కారణమేంటి? తుపాకీతో ఉన్న వ్యక్తితో కలిసి ప్రధాని కార్యక్రమం జరిగే ప్రదేశంలోకి ఎందుకు ప్రవేశించేందుకు ప్రయత్నించారు? అనే అంశాలపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది.
అయితే, ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతోనే వారు అక్కడికి వచ్చినట్లు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మోదీ ముంబై పర్యటన
ప్రధాని మోదీ సెప్టెంబరు 8న సాయంత్రం 5:45 గంటలకు ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2026ను ప్రారంభించనున్నారు. సెప్టెంబరు 8 నుంచి 11 వరకు జరగనున్న ఈ ఏడో ఎడిషన్‌లో ఆర్థిక రంగ భవిష్యత్తు, ఏజెంటిక్ టెక్నాలజీ, టోకెనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ముంబై పర్యటనకు ముందు ప్రధాని గుజరాత్‌లోని వడోదరలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.35 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని 326 రూట్ కిలోమీటర్ల పరిధిలోని మూడు కీలక విభాగాలు ఉన్నాయి.
ప్రధాని పర్యటనకు ముందు నకిలీ గుర్తింపు కార్డు, తుపాకీతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడటం భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది. ఈ ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments