నర్సుల డ్యాన్స్.. సస్పెన్షన్ వేటు.
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన.
వైరల్ వీడియోపై సర్వత్రా విమర్శలు.
ఇద్దరు నర్సుల సస్పెన్షన్, మరికొందరికి నోటీసులు.
జనం వాయిస్, రాజమండ్రి, మార్చి 10:
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. విధులు నిర్వహించాల్సిన సమయంలో ఇద్దరు నర్సులు పేషెంట్లను పట్టించుకోకుండా సినిమాల ఐటెం సాంగ్‌లపై డ్యాన్సులు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్పత్రిలో ఒకరోజు ముందే వేడుకలు నిర్వహించారు. సెమినార్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొంతమంది నర్సింగ్ సిబ్బంది సినిమాల పాటలకు నృత్యాలు చేశారు. అయితే ఈ కార్యక్రమం విధి నిర్వహణ సమయంలోనే జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. కార్యక్రమానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నర్సులపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విధి నిర్వహణ సమయంలో రోగులను నిర్లక్ష్యం చేసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనుచితమని పలువురు విమర్శించారు. ఆస్పత్రి వంటి కీలక సేవా రంగంలో పనిచేసే సిబ్బంది క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యాన్స్ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు కారణం చెప్పాలని నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధి నిర్వహణ సమయంలో క్రమశిక్షణ పాటించాలని అధికారులు సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments