కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతా.
– మీట్ ది ప్రెస్‌లో కవిత సంచలన వ్యాఖ్యలు
– “విద్య, వైద్యం ఉచితం కాకపోతే ప్రజలు ప్రశ్నించాలి”
– కేసీఆర్‌పై రాజకీయ విమర్శలే చేశానన్న స్పష్టీకరణ
– ప్రజల కోసం పోరాటమే లక్ష్యం
జనం వాయిస్, హైదరాబాద్, మే 02:
బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందకపోతే ప్రజలు గట్టిగా ప్రశ్నించాలని, అవసరమైతే తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.
పాంచజన్యంలో ప్రకటించిన ఐదు ప్రధాన అంశాలను అమలు చేయడంలో తాను ఇచ్చిన మాట తప్పితే తాను బాధ్యత వహిస్తానని కవిత స్పష్టం చేశారు. హామీలు ఇచ్చే ముందు ఆర్థిక నిపుణులతో చర్చించి సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ప్రాధాన్యత కేటాయిస్తే ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించడం సాధ్యమేనని వివరించారు. రాష్ట్రంలో ప్రజలు తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని విద్య, వైద్యానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పం ఉంటే ఈ పరిస్థితిని మార్చవచ్చని, గతంలో ఆరోగ్యశ్రీ, ఉచిత భోజన పథకాలు కూడా మొదట విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ విజయవంతంగా అమలయ్యాయని గుర్తుచేశారు. రాజకీయ విమర్శలపై స్పందిస్తూ, తన వ్యాఖ్యలు కేవలం రాజకీయ నేతగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాత్రమేనని, తండ్రిగా ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సిద్ధాంతపరమైన భేదాల కారణంగానే విమర్శలు చేశానని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణలో లోపాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే తల్లిలా ప్రజల కోసం పనిచేసే పాలన అందిస్తామని చెప్పారు. పార్టీ పేరుపై జరిగిన చర్చల గురించి మాట్లాడుతూ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పార్టీ స్థాపనలో అనేక సాంకేతిక, రాజకీయ అంశాలు ఉంటాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. విమర్శలు చేసిన వారిని పట్టించుకోబోమని, ప్రజల కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
మహిళల సాధికారతపై ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ పార్టీలో కనీసం 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. మహిళలు పరిపాలనలో ముందుకు రావాలని, తమ పార్టీ ఇందుకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ డీలిమిటేషన్ వ్యవహారంలో రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, రాజ్యసభకు మరింత అధికారం కల్పించాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు సమాన ఓటింగ్ హక్కులు ఉండాలని చెప్పారు. మావోయిస్టుల అంశంపై స్పందిస్తూ ప్రధాన ప్రవాహంలోకి రావాలని, రాజకీయ పార్టీలలో చేరాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన వారికి స్వాగతం పలుకుతుందని తెలిపారు. ప్రజల మద్దతుపై విశ్వాసం వ్యక్తం చేసిన కవిత, కొత్త ఆలోచనలను ఈ నేల ఎప్పుడూ ఆదరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, అభివృద్ధి, సామాజిక న్యాయం రెండు చక్రాల్లా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments