EPAPER
Tuesday, June 2, 2026
Google search engine

దళితవాడకు చేరిన “మిషన్ భగీరథ” నీరు.

📰 Generate e-Paper Clip

దళితవాడకు చేరిన “మిషన్ భగీరథ” నీరు.

  • “జనం వాయిస్” కథనాలు, ప్రజల పోరాటానికి ఫలితం.
  • ఆనందం వ్యక్తం చేసిన కాలనీ వాసులు.
  • “జనం వాయిస్” దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపిన దళిత వాసులు.
  • ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా కీలక పాత్ర – షేక్ ఖాదర్ బాబా.

మహబూబాబాద్, మే 31 (జనం వాయిస్) :

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు ఆరో వార్డులో ఉన్న దళితవాడ కాలనీకి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మిషన్ భగీరథ తాగునీరు ఆదివారం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు కాలనీ ప్రజలు బావి నీటిపైనే ఆధారపడాల్సి వచ్చేది. అవి కూడా మురికి నీటిగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళితవాడకు మిషన్ భగీరథ నీరు అందడం లేదని, నల్లాల ద్వారా మురికి నీరు వస్తోందని ఇటీవల దళిత మహిళలు కాలిబిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెలుగులోకి తీసుకొస్తూ ఈ నెల 18న “జనం వాయిస్” దినపత్రికలో “దాహం.. దాహం..!” అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అనంతరం గ్రామ నాయకులు షేక్ ఖాదర్ బాబా, జి. సంతోష్, ఏ. ఎల్లయ్య, ఎస్. వెంకన్న, పి. సర్వయ్య, ఏ. హుస్సేన్, పి. రమేష్, ఏ. ప్రతాప్‌లు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న “బేతోలు ప్రజలకు అమృత్ 2.0 నీళ్లెప్పుడు?” అనే మరో కథనాన్ని “జనం వాయిస్” ప్రచురించింది. పత్రికల్లో వచ్చిన కథనాలను, ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మిషన్ భగీరథ నీటిని దళిత కాలనీకి అందించాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారులు దళితవాడ కాలనీకి మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఆదివారం నుంచి నీటి సరఫరాను ప్రారంభించారు. నల్లాల ద్వారా స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు రావడంతో కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ నీటిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, మహిళలు సమస్య పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు, గ్రామ నాయకులు, “జనం వాయిస్” దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది భుక్య రాంజీ, షేక్ ఖాదర్ బాబా, సురేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగన్, పీటర్ శ్రీను, డి.ఏ. గంగుల శ్రీను, వాటర్‌మెన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా కీలక పాత్ర – షేక్ ఖాదర్ బాబా…

ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్న దళితవాడ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన “జనం వాయిస్” దినపత్రికకు, తనతో పాటు పోరాటం చేసిన నాయకులకు, స్పందించిన జిల్లా కలెక్టర్, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి షేక్ ఖాదర్ బాబా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!