కరువులో క్రైస్తవ మిషనరీల సేవలను వివరించిన పుస్తకావిష్కరణ.
- కరువు కాలంలో మిషనరీల సేవలు ఆదర్శనీయం.
- 18, 19వ శతాబ్దాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలపై పుస్తక రచన.
- ‘కరువులో క్రైస్తవ మిషనరీల కార్యాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుశీల ధనుంజయ రెడ్డి.
- ఆత్మీయంగా కలుసుకున్న సండే స్కూల్ పూర్వ విద్యార్థులు.
జనం వాయిస్, పెద్దపల్లి, సెప్టెంబర్ 14:
భారతదేశంలో 18, 19వ శతాబ్దాల్లో సంభవించిన కరువుల సమయంలో క్రైస్తవ మిషనరీలు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ రచయిత పల్లె శాంతిరాజ్ రచించిన ‘కరువులో క్రైస్తవ మిషనరీల కార్యాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కలువరి సువార్త చర్చి సండే స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం పెద్దపల్లిలోని ఇండియా మిషన్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా మిషనరీ దంపతుల కుమార్తె సుశీల ధనుంజయ రెడ్డి ప్రత్యేక ప్రార్థన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రచయిత పల్లె శాంతిరాజ్ మాట్లాడుతూ భారతదేశంలో సంభవించిన కరువుల సమయంలో క్రైస్తవ మిషనరీలు అందించిన సేవలను చారిత్రక ఆధారాలతో పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. బ్రిటిష్ పాలనలో దేశ సంపద దోపిడీకి గురవుతున్న సమయంలో క్రైస్తవ మిషనరీలు సేవాభావంతో పలు సంస్థలను స్థాపించి ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కరువు సమయంలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు అన్నదానం, పోషకాహారం అందించడంతోపాటు విద్యకు దూరమైన చిన్నారులకు విద్యావకాశాలు కల్పించారని వివరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రులను నిర్మించి వైద్యసేవలు అందించారని తెలిపారు. మిషనరీలు చేపట్టిన వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు పేర్కొన్నారు. అనంతరం సండే స్కూల్ పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని చిన్ననాటి జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు కన్నూరి అశోక్, కన్నూరి శ్యామ్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు దివాకర్, కాంగ్రెస్ నాయకుడు పెద్దెల్లి ప్రకాష్, రజిత, పులిపాక సంతోష తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments