ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
జనం వాయిస్, సుల్తానాబాద్, అక్టోబర్ 06:
ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, బాలికల హాస్టల్, విద్యుత్ వ్యవస్థ, పాఠశాల పరిసరాలు, క్రీడా మైదానాన్ని పరిశీలించారు. బాలికల హాస్టల్లో కొన్ని గదులకు తలుపులు సరిగా లేకపోవడం, విద్యుత్ వైరింగ్‌కు సంబంధించిన సమస్యలను గుర్తించిన కలెక్టర్ వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన మరమ్మతు పనులకు అమ్మ ఆదర్శ పాఠశాల గ్రాంట్ ద్వారా నిధులు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని, అవసరమైన భూమి చదును పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించడంతో పాటు ఇంటర్మీడియట్లో జిల్లా స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. పాఠశాల, బాలికల హాస్టల్లో మౌలిక వసతులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ గోల్డీ బుల్బీ కౌర్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments