ఫిట్‌నెస్‌పై కీర్తి సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనం వాయిస్, హైదరాబాద్, మే 18:
ఒకప్పుడు బొద్దుగా కనిపిస్తూ సహజ అందంతో అభిమానులను ఆకట్టుకున్న నటి కీర్తి సురేశ్.. ఇప్పుడు ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారిపోయింది. ఇటీవల ఆమె లుక్‌లో వచ్చిన భారీ మార్పు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించడంతో పలువురు నెటిజన్లు ఆమెపై అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆపరేషన్లు చేయించుకుందని, మరికొందరు ప్రత్యేక ట్రీట్‌మెంట్లు తీసుకుందని ప్రచారం చేశారు. ఈ విమర్శలపై తాజాగా కీర్తి సురేశ్ స్పందించింది.
తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఇప్పటివరకు ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని తెలిపిన కీర్తి.. మొదట్లో జిమ్ అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదని చెప్పింది. “జిమ్ అనేది నా కోసం కాదని అనుకునేదాన్ని. వ్యాయామం చేయాల్సిన అవసరం నాకు లేదనే భావనలో ఉండేదాన్ని. కానీ ‘మహానటి’ సినిమా తర్వాత వచ్చిన విరామం నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం ఇచ్చింది” అని తెలిపింది.
ఆ సమయంలోనే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని, క్రమంగా వర్కవుట్లు ప్రారంభించానని చెప్పింది. “కేవలం తొమ్మిది నెలల్లోనే దాదాపు పది కిలోలు తగ్గాను. అది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు. క్రమశిక్షణతో చేసిన ప్రయత్నం ఫలితం” అని వెల్లడించింది.
తనను లావుగా ఉందంటూ బాడీ షేమింగ్ చేసిన వారికి ఈ మార్పే సమాధానమని కీర్తి పేర్కొంది. “నన్ను చూసి చాలా మంది కామెంట్లు చేశారు. కానీ నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అనుకోలేదు. నా కష్టమే నా సమాధానం అయింది” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు జిమ్ తన జీవితంలో భాగమైందని తెలిపిన కీర్తి.. “ఒకప్పుడు జిమ్ అంటే భయం. ఇప్పుడు ఒక రోజు వర్కవుట్ చేయకపోతే ఏదో మిస్సైనట్లు అనిపిస్తుంది. అది మంచి అలవాటుగా మారింది” అని పేర్కొంది.
తన స్టైల్‌లో కూడా వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ.. “ఒకప్పుడు నేను చీరల్లోనే బాగుంటానని అనుకునేవారు. ఇప్పుడు మోడ్రన్ డ్రెస్సుల్లోనూ ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉంది” అని తెలిపింది.
ప్రస్తుతం కీర్తి సురేశ్ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతోంది. నటిగా మాత్రమే కాకుండా ఫిట్‌నెస్ విషయంలోనూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments