మహారాష్ట్రను ముంచెత్తుతున్న వానలు.
200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు.
జనం వాయిస్, ముంబై, జూలై 7:
మహారాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. గత 48 గంటలుగా కురుస్తున్న అసాధారణ భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబైతో పాటు సాంస్కృతిక రాజధాని పుణె నగరం పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా పుణె జిల్లాలోని పశ్చిమ కనుమలు పరిధిలో మేఘమథనం జరుగుతోంది. ఘాట్ సెక్షన్లలోని పలు వాతావరణ కేంద్రాల్లో ఇప్పటికే 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, పుణె నగర పరిసర ప్రాంతాల్లో సగటున 100 మిమీ మార్కును దాటేసింది. ఈ జలప్రళయం కారణంగా ఇటు పుణె, అటు ముంబై, కొంకణ్ రీజియన్లలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. భారత వాతావరణ శాఖ ముంబై, ఠాణే, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ భారీ వర్షాల ధాటికి ముంబై-పుణె నగరాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే లోని ఖోపోలి-కుస్గావ్ మిస్సింగ్ లింక్ సొరంగం సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. టన్నుల కొద్దీ రాళ్లు, మట్టి రోడ్డుపైకి దూసుకురావడంతో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పాత ముంబై-పుణె హైవేపై కూడా రాత్రీపగలు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ముంబై డివిజన్ పరిధిలోని థాకూర్వాడి – మంకీ హిల్ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్‌లపై కూడా కొండరాళ్లు పడటంతో ముంబై-పుణె మధ్య నడిచే ఇంటర్సిటీ మరియు సుదూర ప్రాంతాల రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది లేదా దారిమళ్లించింది. వర్షాల తీవ్రతను దృష్ట్యా ముంబై, పుణె, ఠాణే, నవీ ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు విద్యాశాఖ తక్షణ సెలవు ప్రకటించింది. ప్రైవేట్ ఆఫీసుల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పుణె జిల్లాలోని మావల్ తహసీల్ పరిధిలో ఒక ఇల్లు కొండచరియల కింద నలిగిపోగా, ఇంద్రాయణి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆలంది మున్సిపల్ కౌన్సిల్ నదిపై ఉన్న అన్ని వంతెనలను మూసివేసింది. పుణె-కోలాడ్ రోడ్డు ఒక విభాగంలో కుంగిపోవడంతో ఆ రూట్ క్లోజ్ అయింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సింహగడ్ కోట ను రెండు రోజుల పాటు పూర్తిగా బంద్ చేశారు. పుణె శివార్లలో వరదల్లో చిక్కుకుపోయిన ఒక ప్రైవేట్ బస్సులోని 37 మంది ప్రయాణికులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి సురక్షితంగా రక్షించాయి. ఇటు ముంబై నగరంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. విఖ్రోలి, కొలాబా, మాతుంగ వంటి లోతట్టు ప్రాంతాలు మోకాళ్లోతు నీటిలో మునిగిపోయాయి. పశ్చిమ రైల్వే పరిధిలోని వసాయ్ రోడ్ – విరార్ సెక్షన్లలో పట్టాలు పూర్తిగా నీట మునగడంతో 20 కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రన్‌వే రక్షణ చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మహారాష్ట్ర అసెంబ్లీని సైతం వర్షాల కారణంగా ఒకరోజు వాయిదా వేయాల్సి వచ్చింది. గత 3-4 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్ష సంబంధిత ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారని విపత్తు నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ ప్రకటించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments