దాహంతో నీళ్ల కోసం బస్సు ఆపిన కోతి.
విదర్భ ఎండల్లో వన్యప్రాణుల అవస్థలు.
ప్రయాణికులు ఇచ్చిన నీటితో దాహం తీర్చుకున్న కోతులు.
వైరల్‌గా మారిన హృదయ విదారక దృశ్యాలు.
జనం వాయిస్, ముంబయి, మే 22:
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో మండుతున్న ఎండలు వన్యప్రాణులపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతున్నాయో తెలియజేసే హృదయ విదారక ఘటన యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. పుసద్ సమీపంలోని ఖండాలా ఘాట్ అటవీ ప్రాంతంలో తీవ్ర దాహంతో అలమటించిన ఓ కోతి రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ బస్సును ఆపి నీళ్లు అడిగిన ఘటన అందరినీ కదిలించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాషిం నుంచి పుసద్ వెళ్తున్న మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఖండాలా ఘాట్ అటవీ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో ఒక్కసారిగా ఓ కోతి రోడ్డుపైకి వచ్చి బస్సుకు అడ్డంగా నిలబడింది. ప్రమాదం జరుగుతుందేమోనని భావించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశారు. మొదట డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు కూడా కోతిని అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కోతి కదలకుండా అక్కడే ఉండిపోయింది. తీవ్రమైన ఎండల కారణంగా అది దాహంతో, నీరసంతో అల్లాడుతోందని ప్రయాణికులు గుర్తించారు. వెంటనే కొందరు తమ వద్ద ఉన్న నీటి బాటిళ్లను తీసి కోతికి అందించారు. దాంతో ఆ కోతి ఆత్రంగా నీళ్లు తాగడం ప్రారంభించింది. ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు భావోద్వేగానికి గురయ్యారు. ఆ కోతి నీళ్లు తాగుతుండగానే సమీపంలోని అడవి నుంచి మరికొన్ని కోతులు అక్కడికి చేరుకున్నాయి. ఒక్కో కోతి దాహం తీర్చుకునేందుకు ఆత్రంగా ముందుకు రావడంతో ప్రయాణికులు తమ వద్ద ఉన్న నీటిని వాటికీ పంచిపెట్టారు. వేడిమి తీవ్రతకు వన్యప్రాణులు ఎలా ఇబ్బందులు పడుతున్నాయో ప్రత్యక్షంగా చూసి చాలామంది చలించిపోయారు. ఈ ఘటనను బస్సులో ప్రయాణిస్తున్న లతా శ్రీవాస్ అనే మహిళ తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. మండుతున్న ఎండలు, నీటి కొరత వలన అడవి జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిని కాపాడకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మరింత విషమిస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కోతులు నీటి కోసం బస్సులను ఆపే పరిస్థితి రావడం హృదయాన్ని మెలిపెడుతోందని పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటనతో విదర్భ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణపై మరోసారి చర్చ మొదలైంది. వేసవిలో అటవీ శాఖ జంతువుల కోసం కృత్రిమ నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఖండాలా ఘాట్ వంటి ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడవి జంతువులు దాహంతో రోడ్లపైకి రావడం అటవీశాఖ వైఫల్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణుల కోసం మరిన్ని నీటి వనరులు ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments