EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అన్నదాత స్థానమెక్కడ?

📰 Generate e-Paper Clip

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అన్నదాత స్థానమెక్కడ?

గౌని ఐలయ్య,
ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సెల్:9490700955.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, 200 సంవత్సరాలు మన దేశాన్ని వలసగా పాలించిన బ్రిటన్ ను కూడా దాటి ముందుకు పోయామని ప్రధాని, కేంద్ర మంత్రులు గొప్పగా చెపుతున్నారు. 2047 నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం కోసం ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని కూడా చెప్తున్నారు. దేశ జనాభాలో సగం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుండడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆ సంఖ్య 70 శాతానికి పైగా ఉండడం,రూపొందించుకున్న రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకోసారి ఎన్నికలు జరిపి ప్రభుత్వాలని ఎన్నుకోవాల్సి వున్న  కారణంగా వ్యవసాయ రంగం గురించి, రైతు కూలీల అభివృద్ధి గురించి  అందరూ మాట్లాడక తప్పటం లేదు. స్వాతంత్ర్యం పొందిన కాలం నుండి వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ అభివృద్ధి అనే మాటలు మాట్లాడని నేతలు లేరు, ప్రణాళికలు వేయని ప్రభుత్వాలు లేవు. స్వాతంత్రం వచ్చిన గత 80 సంవత్సరాల నుండి అమలు చేస్తున్న ఈ ప్రణాళికలు, పథకాలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప రైతు కూలీల నిజ జీవితాలలో మార్పులు తీసుకురాలేదు. ప్రపంచీకరణ విధానాలు, ప్రధానంగా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటిఓ) లో భారతదేశం భాగస్వామిగా చేరడం, వ్యవసాయ రంగాన్ని కూడా అందులో చేర్చడానికి అంగీకరించడం మన మెడకు ఉరి తాడుగా మారింది. అప్పటినుండి రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల బారిన పడటం పెరుగుతూనే వుంది. 1995 నుండి 2018 మధ్యకాలంలో సుమారు నాలుగు లక్షల మంది రైతుకూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుస్థితి మరింత పెరిగింది. ఒక్క 2023 సంవత్సరంలోనే 10700 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రమాదకరంగా మారిన రైతు కూలీల దుస్థితికి ఇది అద్దం పడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది. వాటిని అమలు చేయకపోగా రైతు కూలీలకు నష్టకరమైన కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలను ముందుకు తెచ్చింది. కరోనాకాలంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ  చట్టాలు రైతుల కోపాగ్నికి కారణమయ్యాయి. ఢిల్లీ కేంద్రంగా రైతాంగం సంవత్సర కాలానికి పైగా సాగించిన సమరశీల పోరాటం ఫలితంగా మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, కనీస మద్దతు ధర చట్టం కోసం ఒక కమిటీని వేసింది. ఐదు సంవత్సరాలు గడిచినా అది ఇసుమంత కూడా ముందుకు సాగలేదు. పైగా మరో రూపంలో వాటిని తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్, నేషనల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెట్, జాతీయ సహకార విధానం పేరుతో కార్పొరేట్ అనుకూల చట్టాలను తీసుకువచ్చింది. రైతులకు తీవ్ర నష్టం కలిగించి కార్పొరేట్ శక్తులకు లాభం కలిగించేందుకు ఇప్పుడు నూతన విద్యుత్ బిల్లు, విత్తన బిల్లులను సిద్ధం చేసింది. ఇప్పటికే విత్తన రంగంలో 100% విదేశీ పెట్టబడులను అనుమతిస్తూ ఇప్పుడు విత్తనాలపై బహుళ జాతి సంస్థల ఆధిపత్యాన్ని సుస్థిరం చేయడానికి విత్తన బిల్లులో అవకాశం కల్పించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటంతో పాటు వ్యవసాయ రంగానికి, ఇతర పేద వర్గాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకాలకు మంగళం పాడేందుకు డిస్కంల ఏర్పాటును,విద్యుత్ బిల్లును ముందుకు తెస్తున్నారు.అటవీ సంరక్షణ నియమాలు కూడా ఆదివాసి రైతుకూలీలకు, వారి హక్కులకు భంగం కలిగించేవే. ఒకవైపు రైతు కూలీల కనీస హక్కులు, సబ్సిడీలను రద్దు చేస్తూ వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల చొరబాటుకు బాటలు వేస్తూ దానినే వ్యవసాయ రంగ అభివృద్ధిగా చెపుతున్నారు.
ఇప్పటికే భారత రైతాంగం రుణభారంతో కునారిల్లుతున్నారు. 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వారిని అప్పుల ఊబి నుండి బయట పడవేయడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 20 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ కంపెనీల అప్పులను రద్దు చేసింది. వారికి ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్లకు పైగా పన్ను రాయితీలిస్తుంది.కవలం 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే దేశంలోని రైతులను అప్పుల భారం నుండి బయటపడేయవచ్చు. కేంద్రం అలాంటి పని చేయకపోగా రాష్ట్రాలు ఎన్నికల హామీలలో భాగంగా అరకొరగా రైతుల రుణమాఫీ పథకాలు ప్రకటిస్తుంటే వాటి వల్ల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని కేంద్ర మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. ఒకవైపు బడా కార్పొరేట్ శక్తులకు భారీ రాయితీలు ఇస్తూ రైతు కూలీలకు మొండి చేయి చూపుతూ  కేంద్ర ప్రభుత్వం రైతు కూలీల అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుంది.

*స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు మనకు మేలు చేస్తాయా?
ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోను, యూరోపియన్ దేశాలతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు  చేసుకుంటున్నది. ఈ ఒప్పందాల వల్ల మన రైతులకు లాభం జరుగుతుందని ఊదరగొడుతున్నారు.  ప్రపంచంలోనే వ్యవసాయ రంగానికి అత్యధిక సబ్సిడీలు ఇస్తున్న దేశం అమెరికా. అమెరికా రైతు సగటున 464 ఎకరాలలో సేద్యం చేస్తూ సుమారు ఆరు లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం నుండి పొందుతున్నాడు. అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలలో 25% నుండి 60 శాతం వరకు ప్రభుత్వ నుండి రాయితీలు పొందుతుండగా మన దేశంలో అది కేవలం 4శాతం మాత్రమే. ఎరువులపై సబ్సిడీని ఎత్తివేస్తూ, వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కోతలు విధిస్తూ రైతాంగం నెత్తిపై పెను భారం మోపుతున్న మన ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులతో ‘స్వేచ్ఛగా’ పోటీ పడమంటున్నారు. భారీ సబ్సిడీలతో సేద్యం చేస్తున్న దేశాల ఉత్పత్తులు తక్కువ ధరకే మన మార్కెట్ ను ముంచెత్తుతుంటే వాటితో పోటీ పడమంటున్నారు .ప్రభుత్వానికే ఎదురు సబ్సిడీలు ఇస్తూ అప్పుల ఊబిలో దిగబడి చావలేక, బ్రతకలేక వ్యవసాయం చేస్తున్న మన రైతులకు అది సాధ్యం కానిపని. పైగా అమెరికా లాంటి అగ్ర రాజ్యాల ఆదేశాలకు లొంగి విదేశీ వ్యవసాయ ఉత్పత్తులపై 113 శాతం వరకు సుంకాలు వేసే అవకాశం ఉన్నా వాటిని అతి తక్కువ శాతానికి, చివరకు జీరో సుంకాలకు అనుమతించడం మన రైతులను బలిపీఠంపై ఎక్కించడమే. ఇప్పటికే భారతీయ పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మనం ఎగుమతులు చేస్తున్న ఆహార వాణిజ్య ఉత్పత్తులను కూడా భారీ స్థాయిలో దిగుమతులు అనుమతించడంతో మన వ్యవసాయ రంగ కోలుకోలేని విధంగా నష్టపోతున్నది. తెగ బలిసిన ఆబోతుల తో బక్క చిక్కిన లేగ దూడలు పోటీ పడలేవు. సామ్రాజ్యవాద దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వారికే లాభం చేస్తాయి. మన రైతాంగాన్ని అవి మరింత సంక్షోభంలోకి, అప్పుల సుడిగుండంలోకి నెట్టి వేస్తాయి.
  మన వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషించే వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఎలాంటి చట్టబద్ద హక్కులు లేవు. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతు కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ పాలనలో వారి పరిస్థితి మరింతగా  క్షీణించింది. ఈ స్థితి నుండి రైతు కూలీలను రక్షించడానికి వ్యవసాయంగాన్ని గట్టెక్కించడానికి తగిన ప్రణాళికలు రూపొందించకపోగా ఒట్టిపోయిన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి పాటుపడతున్నామని చెప్పడం ఉత్తమాట. గంపగుత్తగా జిడిపి పెరిగిందని, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఊదర కొట్టడం కాదు,  దేశ జనాభాలో సగ భాగంగా ఉన్న రైతు కూలీలకు దానిలో దక్కిన స్థానమేమిటో చెప్పాలి. ఆకలి సూచీలో దేశం సిగ్గుపడే స్థాయిలో రోజు రోజుకు మన స్థానం దిగజారుతుంది. ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీలు  అభివృద్ధికి నోచుకోకుండా, కనీస హక్కులను కూడా కోల్పోతూ భయం భయంగా బతుకులీడుస్తున్నారు. మరో వైపు అంబానీ, ఆదానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతూ,చివరకు వ్యవసాయరంగాన్ని కూడా వారికి అప్పగించటానికి పూనుకొంటున్నారు.వారు ప్రపంచ కుబేరులను మించి పోతుంటే సంబరపడుతూ,అదే అభివృద్ధని జబ్బలు చరుచుకొంటున్నారు.కొద్దిమంది కార్పొరేట్ శక్తుల అభివృద్ధి మాత్రమే దేశాభివృద్ధి ఎంతమాత్రం కాదు.వారి సంపదను చూపించి ఇండియా బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిందని చెప్పటం  ఆత్మ వంచన తప్ప వేరుకాదు. తూర్పు వైపుకు వేలు చూపిస్తూ పడమరకు ప్రయాణం చేసే విధానాలు అమలు చేస్తున్నంత కాలం దేశంలో ప్రజల అభివృద్ధి జరగదు. దేశంలోరైతు కూలీల, అట్టడుగు వర్గ ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరిగినప్పడే అది నిజమైన  అభివృద్ధి అవుతుంది.
(అఖిల భారత రైతు కూలీ సంఘం {ఏఐకేఎంఎస్} ఆల్ ఇండియా మహాసభలు సెప్టెంబర్ 28,29,30 తేదీలలో ఖమ్మంలో జరగనున్న సందర్భంగా….)


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!