EPAPER
Saturday, June 6, 2026
Google search engine

చేప ప్రసాదానికి విస్తృత ఏర్పాట్లు.

📰 Generate e-Paper Clip

చేప ప్రసాదానికి విస్తృత ఏర్పాట్లు.

– ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సమీక్ష.
– భక్తులకు మెరుగైన సౌకర్యాలు.
– అధికారులకు మంత్రి పోన్నం ప్రభాకర్ ఆదేశాలు.

జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 6:

ఈ నెల 8వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మత్స్యశాఖ సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, క్యూ లైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చేప ప్రసాదం పంపిణీ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుండటంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, వేసవి ఉక్కపోత దృష్ట్యా క్యూ లైన్ల వద్ద ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక వాట్సాప్ సమన్వయ వ్యవస్థ ద్వారా పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే నియంత్రణ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, అంబులెన్స్‌లు, వైద్య శిబిరాలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం సీపీఆర్ బృందాలను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులకు అవసరమైన సమాచారం స్పష్టంగా వినిపించేలా మైక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. షీ టీమ్స్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసి జేబుదొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు తాగునీరు, ఆహారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!